ఎడ్లపాడు మండలం తుర్లపాడు గ్రామ పరిధిలో రైతు ఈదర వీర శంకరరావు మొక్కజొన్న పొలంలోవ్యవసాయ సాంకేతికయాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో డ...
ఎడ్లపాడు మండలం తుర్లపాడు గ్రామ పరిధిలో రైతు ఈదర వీర శంకరరావు మొక్కజొన్న పొలంలోవ్యవసాయ సాంకేతికయాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో డ్రోన్ తో పురుగుమందు పిచికారీ విధానంపై ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. రైతులకు డ్రోన్ సాంకేతికత ఉపయోగాలు, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఏ. హరిప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న కాలానికిఅనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగంలో వేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. తాజా పరిశోధనల ఫలితంగా రైతులకు అనుకూలమైన యంత్ర పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. డ్రోన్ల వినియోగంతో పురుగుమందులు, నీటిలో కరిగే ఎరువుల పిచికారీ సులభంగాచేయవచ్చని తెలిపారు. ముఖ్యంగామొక్కజొన్న, కంది, వరి దమ్ము చేసిన పొలాల్లో చేతితో పిచికారీ చేయడం కష్టమైపోతుందని, డ్రోన్లు ఈ సమస్యను సమర్థంగా పరిష్కరిస్తాయని చెప్పారు. డ్రోన్ పిచికారీ పద్ధతి తక్కువ వ్యయంతో పాటు సుమారు 90 శాతం నీరు, 95 శాతం సమయం ఆదా చేస్తుందని హరిప్రసాద్ వివరించారు. డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం వల్ల మొక్క అంతా సమానంగా తడవడం ద్వారా పురుగుమందుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం మండలంలో రైతులకు సబ్సిడీపై మూడు డ్రోన్లు అందజేసినట్లు తెలిపారు.
డ్రోన్ ఆపరేషన్ చేయాలంటే తగిన శిక్షణ అవసరమని, రైతులు శిక్షణ పొంది ఈ సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రైతు ఈదర వీర శంకరరావు, ప్రగతి కిసాన్ డ్రోన్ గ్రూపు సభ్యులు, సొలస డ్రోన్ పైలెట్ కుంభ వెంకటేశ్వర్లు, గ్రామ వ్యవసాయ సహాయకురాలు విజయలక్ష్మి, గ్రామ రైతులు పాల్గొన్నారు.
COMMENTS