రెండో బిడ్డకు ప్రోత్సాహకాలు యోచనలో ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతోంది. రాష్ట్రంలో సంతానోత్పత్తి ర...
రెండో బిడ్డకు ప్రోత్సాహకాలు యోచనలో ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్‌లో జనాభా సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతోంది. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (TFR) ఆందోళనకర స్థాయిలో 1.5కు పడిపోయింది. సాధారణంగా ఉండాల్సిన 2.1 కంటే ఇది చాలా తక్కువగా ఉందని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. అమరావతిలో జరిగిన 5వ కలెక్టర్ల సదస్సులో ఆయన ఈ గణాంకాలను వెల్లడి చేశారు.జాతీయ సగటు వయసు 28.4 ఏళ్లతో పోలిస్తే, ఏపీలో సగటు వయసు 32.5 ఏళ్లుగా ఉందని, ఇది రాష్ట్రం వేగంగా వృద్ధాప్యం వైపు వెళ్తోందనడానికి సంకేతమని గౌర్ వివరించారు. ఈ ధోరణి కొనసాగితే, 2040 నాటికి వృద్ధులపై ఆధారపడే యువజనాభా తక్కువవుతుందని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ఫ్రాన్స్, హంగేరీ తరహాలో రెండో బిడ్డను కనేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలనలోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా, దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఫెర్టిలిటీ కాలేజీలు’ స్థాపించాలనే నిర్ణయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. వీటి ద్వారా సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న దంపతులకు ప్రభుత్వ సహాయంతో ఐవీఎఫ్ చికిత్స అందించనున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఒకప్పుడు కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చినా, ఇప్పుడు పరిస్థితులు మారాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఎదుర్కొంటున్న వృద్ధాప్య సమస్య మనమూ ఎదుర్కొంటున్నాం. కాబట్టి పిల్లల్ని కనేందుకు కుటుంబాలను ప్రోత్సహించే విధానాలపై దృష్టి పెట్టాలి,” అని పేర్కొన్నారు.అంతేకాక, మహిళల ఉపాధి భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రతి కార్యాలయంలో క్రెచ్ (శిశు సంరక్షణ కేంద్రాలు) ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందని అధికారులు తెలిపారు. దీని ద్వారా మహిళల ఉపాధి శాతం 31 నుండి 59 శాతానికి పెరిగి, రాష్ట్ర జీఎస్‌డీపీ 15 శాతం మేర పెరిగే అవకాశముందని అంచనా వేశారు.
COMMENTS