లారీని బలవంతంగా ఆపి డబ్బులు దోచుకునే ప్రయత్నంలో విషాదం – పల్నాడు జిల్లా ఎస్పీ అభినందన.. చిలకలూరిపేట నాదెండ్ల మండలం గణపవరం గ్రామ...
లారీని బలవంతంగా ఆపి డబ్బులు దోచుకునే ప్రయత్నంలో విషాదం – పల్నాడు జిల్లా ఎస్పీ అభినందన..
చిలకలూరిపేట నాదెండ్ల మండలం గణపవరం గ్రామం పరిధిలోని NH-16 బైపాస్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి చెందడానికి, ఒకరు గాయపడడానికి కారణమైన ఐదుగురు ముద్దాయిలను నరసరావుపేట డి.ఎస్.పి. ఎం. హనుమంత రావు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చాకచక్యంగా గుర్తించి అరెస్టు చేశారు.
సంఘటన వివరాలు...
ఈ విషాదకర సంఘటన డిసెంబర్ 4, 2025వ తేదీ రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో జరిగింది. బోయపాలెం నుండి వస్తున్న ముద్దాయిలు (1. మదమంచి వెంకట అనుజ్ణ నాయుడు అలియాస్ వెంకట్, 2. పుల్లంశెట్టి మహేష్, 3. బెల్లంకొండ గోపి, 4. షేక్ నది బాషా అలియాస్ బాషా, 5. నాలి వెంకట రావు) (TS08HY3158 నెంబరు గల) కారులో హైవేపై వెళ్లే వాహనాలను ఆపి, డ్రైవర్లను కొట్టి డబ్బులు దోచుకోవాలని దురుద్దేశంతో నిర్ణయించుకున్నారు. ముద్దాయిలు తమ కారుతో, మహేంద్ర ట్రాక్టర్ల లోడుతో ఒంగోలు వైపు వెళ్తున్న (MH40DC0889 నెంబరు గల) లారీని ఓవర్ టేక్ చేసి ఆపమని డ్రైవర్‌కు సైగ చేశారు.
లారీ డ్రైవర్ ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వకుండా ఒక్కసారిగా బ్రేకులు వేసి, లారీని రోడ్డుకు ఎడమ వైపునకు పోనిస్తున్న క్రమంలో, లారీ వెనుక వేగంగా వస్తున్న మృతులు ప్రయాణిస్తున్న (AP40AB0688 నెంబరు గల) కారు లారీని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు (1. మేడగం రామ్ రెడ్డి, 2. మెరుగు వెంకట నాగ శ్రీకాంత్ రెడ్డి అలియాస్ పండు, 3. గౌడవర్తి యశ్వంతి సాయి అలియాస్ నాని, 4. శివరాత్రి మహేష్ బాబు) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మిగిలిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా, వారిలో వంగవల్లు వాసు చికిత్స పొందుతూ మరణించారు. మరొకరికి దెబ్బలు తగిలాయి.
ప్రమాదం అనంతరం ముద్దాయిలు, లారీ డ్రైవర్‌ను కూడా బెదిరించారు. ఈ సంఘటనపై నాదెండ్ల పోలీస్ స్టేషన్‌లో Cr.No 151/2025 U/Sec 106(1), 125(a), 105, 125, 126(2) r/w 3(5) BNS OF NADENDLA PS కింద కేసు నమోదు చేశారు.
దర్యాప్తు .... అరెస్ట్....
పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు, నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంత రావు ఆధ్వర్యంలో చిలకలూరిపేట రూరల్ సి.ఐ. బి. సుబ్బానాయుడు , సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. ఎటువంటి ప్రత్యక్ష ఆధారాలు లేకపోయినా, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ముద్దాయిలను గుర్తించి, డిసెంబర్ 12, 2025వ తేదీన నాదెండ్ల పోలీస్ స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. ముద్దాయిల వద్దనుండి వారు ఉపయోగించిన కారు (TS08HY3158) మరియు వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు కేసును చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ ఎం. హనుమంత రావు ని, కేసు దర్యాప్తులో సహకరించిన చిలకలూరిపేట రూరల్ సర్కిల్ సి.ఐ. బి. సుబ్బానాయుడు, నాదెండ్ల ఎస్.ఐ. జి. పుల్లారావు, చిలకలూరిపేట రూరల్ ఎస్.ఐ. జి. అనిల్ కుమార్, ఎడ్లపాడు ఎస్.ఐ. టి. శివ రామకృష్ణలను అభినందించారు.
COMMENTS