పట్టించుకోని అధికారులు, మురుగులో పట్టణం.. చిలకలూరిపేట: పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. పారిశుద్...
పట్టించుకోని అధికారులు, మురుగులో పట్టణం..
చిలకలూరిపేట: పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందంటూ ఇటీవల టిడిపి కౌన్సిలర్ కూనల ప్రమీల చేసిన విమర్శలు అక్షర సత్యాలనిపించేలా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై పట్టణ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పురుషోత్తపట్నం ఆర్చి వద్ద పేరుకుపోయిన వ్యర్థాలు..
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పురుషోత్తపట్నం ఆర్చి సమీపంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ఉత్సవాలు ముగిసి చాలా రోజులవుతున్నా, అక్కడ పారవేసిన ప్లాస్టిక్ గ్లాసులు, ఇస్తరాకులు, ఇతర వ్యర్థాలను తొలగించే నాథుడే కరువయ్యారు. ఈ చెత్త అంతా స్థానిక కాల్వల్లో పేరుకుపోవడంతో మురుగునీరు సాఫీగా ప్రవహించే మార్గం లేక నిలిచిపోయింది. మురుగునీరు వాగులో కలవాల్సిన కాల్వలు ఇలా చెత్తతో నిండిపోవడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
మున్సిపాలిటీకి గోడకు ఆనుకొని 'మురుగు' కష్టాలు..
మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చిలకలూరిపేట మున్సిపాలిటీ గోడకు ఆనుకుని ఉన్న కోర్టు బజార్‌లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. మున్సిపల్ కార్యాలయం కళ్ళముందే ఉన్నా, అక్కడి కాల్వల్లో మురుగు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. గత కొన్ని రోజులుగా ఈ సమస్య కనిపిస్తున్నా, శానిటరీ ఇన్స్పెక్టర్లు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది.
కనుమరుగైన బ్లీచింగ్, సున్నం చల్లకం..
గతంలో పట్టణంలో ఎక్కడైనా చెత్తను తొలగిస్తే, అక్కడ వెంటనే దుర్వాసన రాకుండా, ఈగలు, దోమలు చేరకుండా సున్నం మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కేవలం చెత్తను పైపైన తొలగించి వదిలేయడంతో, ఆ ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు.
ప్రజల ఆగ్రహం: అధికారులు ఏం చేస్తున్నారు?...
పట్టణంలోని ప్రధాన కూడళ్లు, కాల్వలు చెత్తతో నిండిపోయి, మురుగు నిలిచిపోతున్నా శానిటేషన్ ఇన్స్పెక్టర్లకు కనబడటం లేదా అని పట్టణప్రజలుచర్చించుకుంటున్నారు. పారిశుద్ధ్య పర్యవేక్షణ గాలికి వదిలేశారని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి పట్టణాన్ని శుభ్రం చేయించాలని కోరుతున్నారు.
COMMENTS