చిలకలూరిపేట: చిత్తూరు జిల్లా వి.కోట మండల ఆంధ్రజ్యోతి (ABN) విలేఖరి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కిరాతక దాడిని, ఆయన హత్యను నిరసిస్తూ...
చిలకలూరిపేట: చిత్తూరు జిల్లా వి.కోట మండల ఆంధ్రజ్యోతి (ABN) విలేఖరి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కిరాతక దాడిని, ఆయన హత్యను నిరసిస్తూ చిలకలూరిపేటలో పాత్రికేయ సంఘాలు గళమెత్తాయి. ఏపీయూడబ్ల్యూజే, ఏపీఈఎంజేఏ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ మొహమ్మద్ హుస్సేన్‌కు వినతిపత్రం అందజేశారు.మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని దుండగులు వేటకొడవళ్లతో వెంటాడి అత్యంత హేయంగా హత్య చేయడంపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా శ్రీగంధం చెట్ల అక్రమ రవాణాపై ఆయన రాసిన వార్తలే ఈ హత్యకు ప్రేరణగా నిలిచాయని, వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న పాత్రికేయుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు వంటివని నాయకులు మండిపడ్డారు. నిందితులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని, అలాగే జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు, సీనియర్ పాత్రికేయులు బాబ్జి మాస్టర్, పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అడపా అశోక్ కుమార్, రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి షేక్ మస్తాన్ వలి , ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఉప్పాల సుభాని, కార్యదర్శి ఎస్.డి సిద్దిక్, జిల్లా ఈసీ మెంబర్ ఎన్.వి.ఎస్ ప్రసాద్, సీనియర్ పాత్రికేయులు ఆలపాటి ఆంజనేయులు, కొప్పుల కళ్యాణ్ చక్రవర్తి, కొండపాటి రమేష్, పెనుమళ్ళ మనోహర్, యాసం రవి కిరణ్, శివన్నారాయణ, నరసింహల శ్రీకాంత్, వీరేంద్ర, మణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
COMMENTS