• 5న పట్టణంలో నిర్వహించే ఉత్సవాల కర్టెన్ రైజర్ ప్రత్యేక 2.కె రన్ భారీస్థాయిలో విజయవంతం కావాలి. •ఆర్డీవో, ఇతర అధికారులతో కొండవీడు...
• 5న పట్టణంలో నిర్వహించే ఉత్సవాల కర్టెన్ రైజర్ ప్రత్యేక 2.కె రన్ భారీస్థాయిలో విజయవంతం కావాలి.
•ఆర్డీవో, ఇతర అధికారులతో కొండవీడు ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మాజీమంత్రి.
ఎడ్లపాడు మండల పరిధిలోని కొండవీడులో ఫిబ్రవరి 7, 8 తేదీల్లో భారీ ఎత్తున నిర్వహించనున్న కొండవీడు ఉత్సవాల నిర్వహణపై జాతీయస్థాయిలో చర్చ జరగాలని, ప్రజలు.. ముఖ్యంగా పర్యాటకులు తమ జీవితానికి సరిపడా సరికొత్త అనుభూతులతో ఉత్సవాలను ఆస్వాదించాలని, అందుకు తగిన ఏర్పాట్లలో ఎక్కడా చిన్నలోపం తలెత్తడానికి వీల్లేదని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తన నివాసంలో స్థానిక ఆర్డీవో ఇతర అధికారులు, వివిధ శాఖల ప్రధానాధికారులతో కొండవీడు ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఉత్సవాలకు వచ్చేవారు కొండవీడు మార్గంలో కాలుమోపింది మొదలు.. తిరిగి వెళ్లేవరకు తమ మనసు నిండా ప్రభుత్వం నిర్వహించే వివిధ రకాల కార్యక్రమాల ఆనందాన్నే నింపుకోవాలని, అందుకు తగినట్టుగా అన్నిశాఖల యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ప్రత్తిపాటి ఆదేశించారు. ఉత్సవాలకు అతిథులుగా వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రధాన నాయకుల పర్యటన, కార్యక్రమాల్లో ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ప్రత్తిపాటి సూచించారు. ఆర్టీసి అధికారులు పర్యాటకుల్ని కొండపైకి తరలించి, కిందకు తీసుకురావడంలో ప్రణాళికాబద్ధంగా నిబద్ధతతో పనిచేయాలన్నారు. పర్యాటకులకు అవసరమైన తాగునీరు, ఆహారం, ఇతరత్రా ఏర్పాట్లలో యంత్రాంగం మనసుపెట్టి పనిచేయాలని ప్రత్తిపాటి సూచించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు, కూటమినాయకులతో కలిసి కొండవీడు ఫెస్ట్ -2026 గోడ పత్రికలు, ప్రచార పత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధులత, ఎమ్మార్వోలు విజయ శ్రీ, మహమ్మద్ హుస్సేన్, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, పర్యాటకశాఖ అధికారి నాయుడమ్మ, ఆర్టీసీ ఆర్ఎం అజిత్ కుమారి, నాయకులు నాగండ్ల రాంబాబు, కొత్తూరి ప్రదీప్, తుబాటి శ్రీహరి, వినాయక ట్రస్టు సభ్యులు మణి, తదితరులు పాల్గొన్నారు.
COMMENTS