పల్నాడు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్ట...
పల్నాడు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ,ఎస్పీ కృష్ణారావు తో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని, భక్తుల క్యూ లైన్లను పర్యవేక్షించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. శివరాత్రి నాడు ఆలయానికి పోటెత్తే సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. తాగునీరు, నీడ, పారిశుధ్యం, పార్కింగ్ మరియు భద్రతా పరమైన అంశాల్లో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. శివాలయాన్ని కూడా సందర్శించి క్యూలైన్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలు, కొండ మార్గాలు, క్యూ లైన్ల ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు నిరంతరంగా చేపట్టాలని, ఎక్కడా చెత్త పేరుకుపోకుండా ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలను నియమించాలని సూచించారు.అలాగే తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. మహాశివరాత్రి రోజున రాత్రి పూట భక్తులు కొండపైనే ఉండే అవకాశం ఉన్నందున, భద్రతా చర్యలు మరింత చేయాలని, పోలీసు, రెవెన్యూ, దేవాదాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకూడదని, లిఫ్ట్ సమస్యలు, ఇతర విద్యుత్ సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు.వేడుకలు ప్రశాంతంగా జరిగేలా అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడు తూ పోలీస్ శాఖ సమన్వయం తో ప్రజలకు సేవలు అందిస్తుందని, ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా, తిరునాళ్ల ఆధ్యాంతం సమన్వయం చేసుకొని ప్రశాంత వాతా వరణంలో జరిగేలా చూస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డీవో , ఆలయ ఈవో, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
COMMENTS