పల్నాడు జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు టిడ్కో ఇళ్లను గ్రౌండ్ ఫ్లోర్ లోనే మంజూరయ్యేలా చూస్తామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అన్...
పల్నాడు జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు టిడ్కో ఇళ్లను గ్రౌండ్ ఫ్లోర్ లోనే మంజూరయ్యేలా చూస్తామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. వాటితో పాటూ ఎవరికీ మంజూరు చేయని టిడ్కో ఇళ్లలో విభిన్న ప్రతిభావంతులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నేపథ్యంలో స్థానిక కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో విభిన్న ప్రతిభావంతుల కోసం నిర్వహించిన క్రీడా పోటీలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
క్రీడల్లో రాణించిన దివ్యాంగులకు జాతీయ స్థాయి మరియు పారాలింపిక్స్ వంటి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సహకారం అందిస్తామన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విభిన్న ప్రతిభావంతులకు ఇచ్చిన ఏడు వరాలు సరిగా అమలయ్యేలా చూస్తామన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, నైపుణ్య శిక్షణ, విద్య&వ్యాపార రుణాలు అందిస్తామన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక...
విభిన్న ప్రతిభావంతుల అవసరాల దృష్ట్యా వారికోసం ప్రత్యేకంగా వసతులు, సమయం కేటాయించి వారి సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. ప్రతి నెలా నాలుగో శనివారం కలెక్టరేట్ లో విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడించారు. ఈ అవకాశాన్ని విభిన్న ప్రతిభావంతులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
గతంలో రెండేళ్ల పాటూ దివ్యాంగుల సంక్షేమ శాఖకు డైరెక్టర్ గా పని చేయడం వల్ల దివ్యాంగుల సంక్షేమం తనకు ప్రాధాన్యత అంశంగా మారిందన్నారు. తాను డైరెక్టర్ గా ఉన్న రోజుల్లోనే ఆంధ్ర ప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల హక్కుల నిబంధనలు,2023 రూపొందించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్ పర్సన్ గోనుగుంట్ల కోటేశ్వర రావు, జిల్లా దివ్యాంగుల సంక్షేమ అధికారి తదితరులు పాల్గొన్నారు.
COMMENTS