చిలకలూరిపేట: పట్టణంలోనే స్థానిక గ్రంథాలయంలో శుక్రవారం నాడు 58వ జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్...
చిలకలూరిపేట: పట్టణంలోనే స్థానిక గ్రంథాలయంలో శుక్రవారం నాడు
58వ జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ పి.శ్రీ హరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్య ఉద్యమాలలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. ఆ రోజుల్లో రేడియోలు లేకపోవడంతో స్వాతంత్ర్య ఉద్యమాల సమాచారం గ్రంథాలయాల ద్వారానే తెలిసేదని చెప్పారు. ఉద్యమకారులు అక్కడి పుస్తకాలు చదివి ఎలా ముందుకు సాగాలో తెలుసుకొని పోరాటాలను కొనసాగించారని గుర్తుచేశారు.పూర్వం కాలంలో ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్న విద్యార్థులు ఉన్నత విద్యను సాధించేందుకు గ్రంథాలయాలు ఎంతో తోడ్పడ్డాయని అన్నారు. చాలామంది ఉన్నతాధికారులుగా ఎదగడానికి ఈ గ్రంథాలయాలు మద్దతుగా నిలిచాయని పేర్కొన్నారు. అయితే, నేటి పరిస్థితుల్లో గ్రంథాలయాల ప్రాధాన్యత తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.భవిష్యత్ తరాల వారికి గ్రంథాలయాల విలువను తెలియజేయడం మనందరి బాధ్యత అని సూచించారు.బాలల దినోత్సవం సందర్భంగా నేటి విద్యార్థులే రేపటి దేశాభివృద్ధికి నాంది పలికేవారని అన్నారు.అందరు విద్యార్థులకు చదువు విలువను, గ్రంథాలయాల ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు తెలియజేయాలని సూచించారు.తాను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు గ్రంథాలయాల ద్వారా అభ్యాసం చేసానని గుర్తు చేసుకున్నారు.
COMMENTS