కూటమిప్రభుత్వ ప్రధాన ఆశయమైన పీ-4 అమల్లో అధికారులు, నిర్లక్ష్యాన్ని వీడాలని, గ్రామ, మండల, పట్టణస్థాయి నాయకులతో సమన్వయం చేసుకుంటూ ...
కూటమిప్రభుత్వ ప్రధాన ఆశయమైన పీ-4 అమల్లో అధికారులు, నిర్లక్ష్యాన్ని వీడాలని, గ్రామ, మండల, పట్టణస్థాయి నాయకులతో సమన్వయం చేసుకుంటూ బంగారుకుటుంబాల కలలు, ఆశయాల్ని నిజం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.స్థానిక క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన పీ-4 అమలు, ప్రజలు అందించే అర్జీల పరిష్కారంపై (పీజీఆర్ఎస్) పై నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో ప్రత్యక సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందు నిలపడంతో పాటు.. పేదరికాన్ని నిర్మూలించి, పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్న సత్సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పీ-4కు శ్రీకారం చుట్టారని ప్రత్తిపాటి తెలిపారు. పీ-4 విశిష్టత, విధివిధానాలపై అధికారులు అవగాహన పెంచుకొని, ఆచరణలో అద్భుత ఫలితాలు సాధించినప్పుడే ముఖ్యమంత్రి ఆశయం నెరవేరుతుందన్నారు. విజన్ – 2047 లక్ష్య సాధన దిశగా అభివృద్ధి, సంక్షేమంలో ఏపీని పరుగులు పెట్టిస్తున్న దార్శనిక నాయకుడి ఆలోచనల అమల్లో మనవంతు పాత్ర పోషించడం మనందరి బాధ్యతనే నిజాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు.
*పేదలకు అండగా నిలవాలన్న ఆలోచనాపరులందరినీ పీ-4లో భాగస్వాముల్ని చేయండి.* *ఎవరికి తోచిన సాయం వారు బంగారు కుటుంబాలకు అందించేలా చూడండి.*
పేదరిక నిర్మూలనకు దోహదపడే పీ-4లో భాగంగా సచివాలయ సిబ్బంది గుర్తించిన బంగారు కుటుంబాల బాధ్యతల్ని మార్గదర్శులకు అప్పగించడంతో పాటు,మార్గదర్శుల ఎంపికలో అధికార యంత్రాంగం చురుగ్గా వ్యవహరించాలని ప్రత్తిపాటి సూచించారు. స్థానికంగా ఉండే ఎన్ఆర్ఐలు, వివిధ రంగాల్లో స్థిరపడిన వారి వివరాలను ఆయా గ్రామ, మండల, పట్టణ నాయకుల్ని సంప్రదించి సేకరించాలని, వారి ద్వారా మార్గదర్శులకు చేరువ కావాలన్నారు. బంగారు కుటుంబాల పూర్తి సమాచారాన్ని, పేదల స్థితిగతుల్ని ఎన్ఆర్ఐలకు వివరించి, ఏ విధంగా ఆయా కుటుంబాలను ఆదుకోవాలో తెలియచే యాలన్నారు. పేదలకు అండగా నిలవాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరినీ మార్గదర్శుల జాబితాలో చేర్చాలన్నారు. కొంతమంది ఆదాయం తక్కువ ఉన్నా.. ఉన్నంతలో పేదలకు సేవ చేయాలనే సదుద్దేశంతో ఉంటారని, అలాంటివారిని ఒకచోటికి చేర్చి, వారిద్వారా బంగారు కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేయగలమనే దానిపై ఆలోచన చేయాలన్నారు. పేదరిక నిర్మూలనలో భాగస్వాములయ్యే మార్గదర్శులకు ప్రభుత్వం ఏవిధంగా అండగా ఉంటుందో, ఎలాంటి రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తుందో స్పష్టంగా తెలియచేయాలన్నారు. అవసరమైతే నియోజకవర్గంలోని ఎన్ఆర్ఐలు, భిన్నరంగాల్లో స్థిరపడి, సమాజశ్రేయస్సుని కాంక్షించే స్థితిమంతుల వివరాలు సేకరించి, వారికి బంగారు కుటుంబాల్ని అనుసంధానిస్తూ ప్రత్యేక నెట్ వర్క్ ఏర్పాటు చేయాలని ప్రత్తిపాటి సూచించారు.
*అర్జీదారుల సంతృప్తికర సమాధానంతోనే సమస్య పరిష్కారమైనట్టు..*
ప్రజాసమస్యల పరిష్కార వేదికలో (పీజీఆర్ఎస్) భాగంగా ప్రతివారం క్రమంతప్పకుండా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నామని, తన ఆదేశాలు, సూచనల్ని గౌరవించి, వాటి పరిష్కారంలో ఎంత చిత్తశుద్ధితో ఉన్నామనే అంశంపై ప్రతి అధికారి, ఉద్యోగి ఆత్మపరిశీలన చేసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రధ్ద పెట్టిందని, రోజువారీగా వస్తున్న అర్జీలు..పరిష్కారమయ్యేవి.. పూర్తిగా పరిష్కారమయినవి.. చివరిగా అర్జీదారుల సంతృప్తికర స్థాయిని కూడా తెలుసుకుంటున్నారని, అదేవిధంగా అధికారులు సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ప్రత్తిపాటి సూచించారు. ప్రజల అర్జీలు అధికారులకు పంపాక, అవి ఏదశలో ఉన్నాయో, అర్జీదారుల్ని, యంత్రాం గాన్ని సంప్రదించే బాధ్యతను కార్యాలయ సిబ్బంది సక్రమంగా నిర్వర్తించాలని ప్రత్తిపాటి ఆదేశించారు.
ఈ సమావేశంలో జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు, మూడు మండలాల ఎంపీడీవోలు, పి4 మహమ్మద్ అలీ, ప్రత్యేక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
COMMENTS