రాష్ట్ర హోం & విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత వంగలపూడి అమరావతి: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దార్కానిపాడు గ్రామంలో హత్య...
రాష్ట్ర హోం & విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత వంగలపూడి
అమరావతి: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దార్కానిపాడు గ్రామంలో హత్యకు గురైన తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించినట్లు రాష్ట్ర హోం & విప్తత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత వంగలపూడి తెలిపారు.
మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలసి ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించడం జరిగిందన్నారు. ఇదే విషయంపై నేడు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించి బాదిత కుటుంబానికి పరిహారాన్ని ప్రకటించడం జరిగిందన్నారు. ఈ ఘటనలో మరణించిన తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు పరిహారాన్ని ప్రకటించారన్నారు. వారి ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, రూ.5 లక్షల చొప్పున ఫిక్సుడ్ డిపాటిజ్ చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఆ ఇద్దరు పిల్లలను చదివించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పవన్, భార్గవ్ లకు కూడా ప్రభుత్వం పరిహారం ప్రకటించడం జరిగిందని ఆమె తెలిపారు. మృతుని సొంత తమ్ముడైన పవన్‌కు 4 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని ఆమె తెలిపారు. అదే విధంగా భార్గవ్‌కు రూ.3 లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ఈ హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని, విచారణ వేగవంతంగా జరిగేందుకై ప్రత్యేక పీపీని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ఈ హత్యకు కారణమైన నిందితునికి ఎట్టి పరిస్థితిల్లోనూ బెయిల్ రాకుండా చూడాలని, కఠినంగా శిక్షించేందుకు సత్వరమే తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాదికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆమె తెలిపారు.
ఈ సంఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణిస్తూ వెంటనే రాష్ట్ర స్థాయి కమిటినీ ఏర్పాటు చేయడం జరిగిందని, అందుతో తాను, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా. పి. నారాయణ, తాడేపల్లిగూడెం శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మరియు కందుకూరి శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సభ్యులగా ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈ కమిటీ సభ్యులు హత్యకు గురైన తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు కుటుంబ సభ్యులను కలసి పరామర్శించి, ప్రభుత్వ పక్షాన పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరుగుతుందని భరోసా ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం, నిందితుడు కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ తన వాహనంతో తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు, పవన్, భార్గవ్ లు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్‌ను రాళ్లపాడు సమీపంలో ఢీకొట్టడం జరిగిందన్నారు. ఈ ఘటనలో లక్ష్మీ నాయుడు అక్కడికక్కడే మృతి చెందగా, పవన్, భార్గవ్ లు తీవ్రమైన గాయాలు పాలవ్వడం జరిగిందన్నారు. బాదితుని సొంత తమ్ముడైన పవన్ వెన్నుపూస పూర్తిగా దెబ్బతిందని, నడవలేని స్థితిలో ఉన్నాడని ఆమె తెలిపారు. హరిశ్చంద్ర ప్రసాద్, లక్ష్మీ నాయుడు మద్య ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన తేడాల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.
COMMENTS