విలీన గ్రామాల అంశమే ఎజెండాలో హాట్‌టాపిక్.. చిలకలూరిపేట మున్సిపల్ సాధారణ సమావేశం శుక్రవారం తీవ్ర వాదోపవాదాల మధ్య ముగి...
విలీన గ్రామాల అంశమే ఎజెండాలో హాట్‌టాపిక్..
చిలకలూరిపేట మున్సిపల్ సాధారణ సమావేశం శుక్రవారం తీవ్ర వాదోపవాదాల మధ్య ముగిసింది.అనేక అంశాలు ఎజెండాలో ఉన్నప్పటికీ,విలీన గ్రామాల సమస్య ప్రధాన చర్చా విషయంగా నిలిచింది.సభ్యుల మధ్య పరస్పర నిందారోపణలు, వాదప్రతివాదాలతో కౌన్సిల్ హాల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణములోని మైలవరపు గుండయ్య కౌన్సిల్ హాలులో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ-పాస్ యంత్రాల చెల్లింపుపై ఘర్షణాత్మక చర్చ..
మొబైల్ ఈ-పాస్ మిషన్ల కొనుగోలు,చెల్లింపులపై కౌన్సిల్ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు మాట్లాడుతూ ప్రభుత్వమే ఈ యంత్రాలను సరఫరా చేసిందని, కానీ అసలు మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవడం వల్ల రూ. 1,18,472 నుంచి రూ. 2,96,659 వరకు మొత్తం పెరిగి చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు.అయితే ఈ ఆలస్యంపై 37వ వార్డు కౌన్సిలర్ పాములపాటి శివకుమారి చైర్మన్‌ను నిలదీస్తూ “డబ్బులు లేవా? లేక కట్టకుండా వడ్డీ చెల్లించాలనుకున్నారా?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు. దీనికి కమిషనర్ “గతంలో ఆలస్యం జరిగింది. ఇటీవలే చెల్లించాం” అని సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నట్లు ఆయన తెలిపారు.
డ్రైనేజీ, వర్షపు నీటిపై చర్చ..
డ్రైనేజీ సమస్యపై 37వ వార్డు కౌన్సిలర్ శివకుమారి ప్రశ్నించగా, తుఫానుకారంగా ఏఎంజి ప్రాంతంలో రాత్రి జేసీబీల సహాయంతో నీరు తొలగించామని కమిషనర్ వివరించారు.కానీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీరు నిలిచిపోతున్నట్లు కౌన్సిలర్ తెలియజేశారు. దీని పై కమిషనర్ “అక్కడ ప్రధాన డ్రెయిన్ మూసుకుపోయిందని, దానిని సరిచేస్తే సమస్య తగ్గుతుందన్నారు”.
విలీన గ్రామాల సమస్యతో వేడెక్కిన సభ..
విలీన గ్రామాల చర్చకు వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు శ్రీకారం చుట్టారు. “మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకు అభివృద్ధి రాలేదు. అయినప్పటికీ ఇప్పుడు తిరిగి పంచాయతీకి వెళ్లాలన్న ఆలోచన సరైంది కాదు” అని అభిప్రాయపడ్డారు.దీనిపై టీడీపీ సభ్యుడు గంగ శ్రీనివాసరావు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సారథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించగా,వైసీపీ సభ్యుడు బేరింగ్ “గత పాలనలో కనీస సౌకర్యాలే లేవు” అంటూ ప్రతివాదించారు.దీంతో టీడీపీ–వైసీపీ కౌన్సిలర్ల మధ్య కాస్త వేడి వాతావరణం నెలకొంది.
ఐదేళ్లుగా గ్రాంట్లు రాలేదని ఆవేదన.
కౌన్సిలర్ జాలది సుబ్బారావు మాట్లాడుతూ, “గత ఐదేళ్లుగా మా వార్డుకు ఒక్క రూపాయి గ్రాంటు కూడా రాలేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. పలు సార్లు విజ్ఞప్తి చేసినా “గ్రాంట్లు లేవు” అనే సమాధానమే వస్తోందని తెలిపారు. వచ్చే రోజుల్లో తమ వార్డుకు అర్బన్ లేదా రూరల్ గ్రాంట్ల ద్వారా అయినా నిధులు కేటాయించాలని ఆయన కౌన్సిల్‌ను కోరారు.
కమిషనర్ వివరణ..
విలీన గ్రామాల నుంచి గత ఐదేళ్లుగా పన్ను వసూళ్లు జరగలేదని కమిషనర్ శ్రీహరి బాబు వెల్లడించారు.ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఆర్థిక సంఘం నుంచి నిధుల కేటాయింపులు నిలిపివేయబడే అవకాశం ఉందని హెచ్చరించారు.సమావేశం ముగింపు సమయంలో కౌన్సిలర్లు అడిగిన పలు అంశాలపై అధికారులు సమాధానాలు ఇస్తూ సమావేశాన్ని ముగించారు.
COMMENTS