దసరా నుంచి దీపావళి వరకు – “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” ప్రచార కార్యక్రమాలు పల్నాడు: జిఎస్టి సంస్కరణలతో ప్రజలకు ...
దసరా నుంచి దీపావళి వరకు – “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” ప్రచార కార్యక్రమాలు
పల్నాడు: జిఎస్టి సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు చేకూరనుందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు.శుక్రవారం కలెక్టరేట్ లో జీఎస్టీ అమలు ,అవగాహన కార్యక్రమం పైన సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు ఎంతగానో మేలు చేకూర్చనున్నాయన్నారు. నిత్యావసర సరుకులు, గృహ ఉపకరణాలు, ఔషధాలు , విద్య , స్టేషనరీ ఉత్పత్తులు, వస్త్రాలు , క్రీడా వస్తువులు, రవాణా, హోటల్ తదితర రంగాలలో నూతనంగా తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణల కారణంగా సెప్టెంబర్ 22 నుంచి పన్నులు తగ్గుతాయని కలెక్టర్ వివరించారు. వ్యవసాయ ఉపకరణాల ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయని అన్నారు.
జీఎస్టీ సంస్కరణలతో కలిగే మేలును ప్రజలకు వివరించడానికి, అవగాహన కల్పించడానికి సూపర్ జిఎస్టి -సూపర్ సేవింగ్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా దసరా నుండి దీపావళి వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించ నున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలకి జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా, వాణిజ్య పన్నుల శాఖ నోడల్ డిపార్ట్మెంట్ గా వ్యవహరిస్తుందన్నారు.
జిల్లా మండల మున్సిపాలిటీ గ్రామ వార్డు స్థాయిలో వివిధ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించే అంశంపై చర్యలు చేపడతామన్నారు.ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జిఎస్టి హెల్ప్ డెస్క్ లో ఏర్పాటు చేసి ఆయా శాఖలకు సంబంధించిన ఏఏ వస్తువులపై జీఎస్టీ సంస్కరణల అనంతరం ధరలు తగ్గనున్నాయో వివరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు...
హౌస్ హోల్డ్ సేవింగ్స్ సంబంధించి జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాలు వద్ద ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం, జీఎస్టీ సంస్కరణలకు ముందు తరువాత ధరలు తగ్గడం గురించి ప్రదర్శనలు తదితరాలను వివరిస్తారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి సంస్కరణల మేలును వివరిస్తారని తెలిపారు.
సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 6 వరకు...
వ్యవసాయం మరియు ఇతర వృత్తులకు సంబంధించిన వ్యక్తులకు కలిగే మేలును రైతు సేవా కేంద్రాలు, జిల్లా, మండల నియోజకవర్గ కేంద్రాల వద్ద అవగాహన కల్పిస్తారన్నారు. ట్రాక్టర్ ర్యాలీలు, వ్యవసాయ పరికరాల ప్రదర్శనలు, మేళాలు, వర్క్ షాప్ లు, ఫ్లయర్ల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తా మన్నారు.
అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 13 వరకు...
మానవ వనరుల అభివృద్ధి, సాంకేతికత డిజిటల్ సాధికారత కు సంబంధించిన రంగాలలో జరిగే మేలును పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థలు, ఆసుపత్రులు ,ఆరోగ్య కేంద్రాలు జిల్లా మండల నియోజకవర్గ కేంద్రాల వద్ద ఎస్సే రైటింగ్, పెయింటింగ్ కాంపిటీషన్లు, ఉపన్యాస పోటీలు, ఎగ్జిబిషన్లు మేళాలు సెమినార్లు తదితర కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పిస్తామని కలెక్టర్ వివరించారు.
అక్టోబర్ 14 నుంచి 18 వరకు....
అభివృద్ధి సంపద సృష్టి రంగాల మీద జీఎస్టీ సంస్కరణల కారణంగా కలిగే మేలును వివరించడానికి ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అదే విధంగా జిల్లా స్తాయిలో షాపింగ్ వేడుకలు, సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
అక్టోబర్ 19 కు ఒక రోజు ముందుగా ప్రజల ను భాగస్వామ్యం చేస్తూ, సామూహిక దీపావళి వేడుకలు జిల్లాస్థాయిలో నిర్వహించే విధంగా చర్యలు చేపడతామని కలెక్టర్ వివరించారు.
అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేస్తూ జిఎస్టి సంస్కరణల కారణంగా ప్రజలకు కలిగే మేలును క్షేత్రస్థాయిలో వివరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ , జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS