నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్లు అనుక్షణం వెన్నంటే ఉంటున్నాయి. జేబులోంచి ఫోన్ తీసి, ఇలా క్లిక్ చేసి అలా ఫొటోలు తీయటం నిత్యకృత్యంగా మ...
నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్లు అనుక్షణం వెన్నంటే ఉంటున్నాయి. జేబులోంచి ఫోన్ తీసి, ఇలా క్లిక్ చేసి అలా ఫొటోలు తీయటం నిత్యకృత్యంగా మారింది. అయితే వాటిని భద్రంగా ఉంచుకోవటం, మన అనుమతి లేకుండా ఎవరూ వాటిని చూడకుండా కాపాడుకోవటం చాలా ముఖ్యం. ఇందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవిగో..
బలమైన పాస్‌వర్డ్స్, బయోమెట్రిక్స్
స్మార్ట్‌ఫోన్‌ను భద్రంగా కాపాడుకోవటానికి అతి తేలికైన మార్గం బలమైన పాస్‌వర్డ్ లేదా పాస్‌కోడ్ నిర్ణయించుకోవటం. 1234, 0000 లాంటి సులువైనవి పెట్టుకోవద్దు. అంకెలు, అక్షరాలతో కూడిన కఠినమైన పాస్‌వర్డ్ ఎంచుకోవాలి. స్క్రీన్‌లాక్ ఆప్షన్లలో ప్యాటర్న్, పిన్‌తో పాటు పాస్‌వర్డ్ సదుపాయమూ ఉంటుంది. అందుబాటులో ఉంటే ఫింగర్‌ప్రింట్ లేదా ఫేషియల్ రికగ్నిషన్ వంటి బయోమెట్రిక్ ధ్రువీకరణ ఫీచర్లనూ ఆన్ చేసుకోవాలి. ఇవి అదనపు భద్రత కల్పిస్తాయి. అనధికారికంగా ఇతరులు ఫోన్‌ను యాక్సెస్ చేయకుండా నిలువరిస్తాయి.
టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్‌ఏ)
ఇది పాస్‌వర్డ్‌కు మరో రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. ఫోన్‌లోని యాప్స్ కోసం 2ఎఫ్‌ఏ ఎనేబుల్ చేసుకున్నారనుకోండి. ఎవరికైనా పాస్‌వర్డ్ తెలిసినా రెండోసారి ధ్రువీకరించకపోతే లాగిన్ కాలేరు. ఎస్‌ఎంఎస్ లేదా అథెంటికేషన్ యాప్ రూపంలో 2ఎఫ్‌ఏను నిర్ణయించుకోవచ్చు.
తరచూ అప్‌డేట్
స్మార్ట్‌ఫోన్ ఓఎస్, యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. కొత్త ముప్పులను ఎదుర్కోవటానికి, లోపాలను సరిచేయటానికి డెవలపర్లు తరచూ అప్‌డేట్స్ విడుదల చేస్తుంటారు. వీలున్నప్పుడల్లా ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయ్యేలా ఫోన్‌ను సెట్ చేసుకోవటం మంచిది. దీంతో కీలకమైన భద్రత సదుపాయాలు అందుతాయి. వ్యక్తిగత ఫొటోలు హ్యాకర్ల చేతిలో పడకుండా చూసుకోవచ్చు.
ఎన్‌క్రిప్టెడ్ క్లౌడ్ స్టోరేజీ సేవలు
ఫొటోలను పరికరంలో ఉంచటం కన్నా ఎన్‌క్రిప్ట్ అయిన క్లౌడ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తే మరింత భద్రంగా ఉంచుకోవచ్చు. బలమైన ఎన్‌క్రిప్షన్ ప్రమాణాలు పాటించే విశ్వసనీయమైన క్లౌడ్ స్టోరేజీలను వాడుకోవాలి. స్టోర్ అయిన డేటాను మీరు మాత్రమే యాక్సెస్ చేయటానికి వీలు కల్పిస్తాయి. ఇతరులెవరికైనా ఫోన్ చిక్కినా ధ్రువీకరణ లేకపోవటం వల్ల ఎన్‌క్రిప్ట్ అయిన ఫైళ్లను చూడలేరు.
యాప్ అనుమతులతో జాగ్రత్త
కొత్త యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు అవి అడిగే అనుమతుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అనవసరంగా ఫొటోస్ లేదా కెమెరా యాక్సెస్‌కు అనుమతించొద్దు. కొన్ని యాప్స్ అవసరం లేకపోయినా అనుమతులను అడగొచ్చు. హాని తలపెట్టేవారు, హ్యాకర్లు వీటిని దుర్వినియోగం చేయొచ్చు. ప్రతీ యాప్ పర్మిషన్ సెటింగ్స్‌ను తరచూ సమీక్షించుకోవాలి. అవసరం లేని అనుమతులను వెంటనే డిసేబుల్ చేయాలి.
.jpg)
COMMENTS