ప్రజా సమస్యల పరిష్కారంలో స్పష్టమైన వైఖరి, మూల కారణాలపై దృష్టి అవసరం ముందస్తు ప్రణాళికలు, సమస్యల నివారణ దిశగా వ్యూహాలు – శీఘ్ర ప...
ప్రజా సమస్యల పరిష్కారంలో స్పష్టమైన వైఖరి, మూల కారణాలపై దృష్టి అవసరం
ముందస్తు ప్రణాళికలు, సమస్యల నివారణ దిశగా వ్యూహాలు – శీఘ్ర పరిష్కారమే లక్ష్యం
ప్రభుత్వం ప్రాధాన్యతా కార్యక్రమాల అమలులో నిబద్ధత, పారదర్శకత తప్పనిసరి.
ప్రజలకు నమ్మకంతో కూడిన పరిపాలన మన ముందు ఉన్న ప్రధాన లక్ష్యం
వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయం తో అడుగులు వేయాలి
టీం గా కలిసి కట్టుగా జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం
జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
పల్నాడు జిల్లా కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి
కృతిక శుక్లా శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హల్‌లో జిల్లా అధికారులతో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా పరిపాలనలో తీసుకోబోయే దిశ, రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చర్చించాల్సిన పలు అంశాలపై స్పష్టమైన సమీక్ష నిర్వహించండం జరిగింది.
*స్పష్టమైన వైఖరి – సమస్యల పరిష్కార దిశగా అడుగులు*
జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను అర్థం చేసుకోవడంలో అధికారుల నుండి స్పష్టమైన వైఖరి అవసరమని సూచించారు. ప్రతి శాఖలో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు, దరఖాస్తులు, కేసులను సమగ్రంగా పరిశీలించి తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు. సమస్యలను సగటు దృష్టితో కాకుండా, మూల కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలని ఆమె నొక్కి చెప్పారు. ఐ వి ఆర్ ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ కి చెందిన అంశాల గురించి సంబంధిత అధికారులు పౌర సేవలు అందించే క్రమంలో మెరుగైన పనితీరు చూపాలని పేర్కొన్నారు
*ముందస్తు ఆలోచన – శీఘ్ర పరిష్కారమే లక్ష్యం*
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, క్షేత్ర స్థాయిలో సమస్యలు మూడో వ్యక్తి ద్వారా తన వద్దకు రాకుండా ముందుగా మీరే గుర్తించి వాటికి తగిన పరిష్కార సూచనలతో రావాలన్నారు.
సమస్యలు తలెత్తిన తరువాత చర్యలు తీసుకోవడం కాకుండా, ముందుగానే సమస్యల నివారణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాకాలం, వరదలు, తాగునీటి సమస్యలు, రహదారి మరమ్మతులు వంటి అంశాలను ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల అంచనాలను తీర్చడం, వారికి కావాల్సిన సౌకర్యాలను సమయానికి అందించడం పరిపాలన లక్ష్యంగా కావాలని ఆమె స్పష్టంచేశారు.
*ప్రభుత్వ ప్రాధాన్యతా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై నిబద్ధత*
కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, పేదల సంక్షేమ కార్యక్రమాలు జిల్లా స్థాయిలో సమర్థవంతంగా అమలవ్వాలని పేర్కొన్నారు. ఈ పథకాల లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, నిబద్ధతతో, సమయ పాలనతో అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రతి అధికారి విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించి ప్రజల్లో పరిపాలనా పరంగా నమ్మకం పెంచాలని ఆమె స్పష్టం చేశారు.
*విధి నిర్వహణలో క్రమశిక్షణ – ప్రజా నమ్మకమే పరమావధి*
కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అన్ని స్థాయిల్లో పరిపాలనలో బాధ్యతాయుత ధోరణి కనబరచాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా అందిస్తున్న సేవలు ప్రజలకు నిజ సమయంలో చేరేలా అధికారులు పర్యవేక్షించాలి.
“ప్రజలు ప్రభుత్వంపై ఉంచే నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మనందరి బాధ్యత” అని కలెక్టర్ స్పష్టంచేశారు. పిజిఆర్ఎస్ కు సంబంధించి కలెక్టరేట్ కు రావడం జరుగుతోందని, వాస్తవంగా డివిజన్ మండల పరిధిలో వాటికి సంబంధించిన పరిష్కారం లభిస్తున్న, అధికారులు సరైన విధంగా చర్యలు తీసుకోవడం లో లోపం, ప్రజల సమస్య పూర్తి వివరాలు తెలుసుకోవడం లో చొరవ చూపక పోవడం ప్రధాన కారణం అన్నారు.
మనందరం కలిసి కట్టుగా టీం లా పని చేసి జిల్లాను అగ్ర గామిగా నిలపడం లో సమన్వయం పరస్పర సహకారం తో కలిసి పని చేద్దాం అని కలెక్టర్ కోరారు. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంలో జిల్లా కు చెందిన ముఖ్యమైన సమస్యలు, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో రావలసిన అనుమతులు, నిధులు మంజూరు తదితర అంశాలపై శాఖల వారిగా చర్చించడం జరిగింది. ఈమేరకు సమగ్ర నివేదిక అందచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో
జాయింట్ కలెక్టర్ సూరజ్ ,జిల్లా రెవెన్యూ అధికారి , ఆర్డీవో లు ,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS