పనుల క్రమబద్ధీకరణ, సలహాలు తీసుకోవటం వంటి పనులకు ఇప్పుడు చాట్‌జీపీటీ మంచి చేదోడుగా నిలుస్తోంది. చాలామంది దీన్ని రోజువారీ వ్యవహారాల్లో తరచూ ...
పనుల క్రమబద్ధీకరణ, సలహాలు తీసుకోవటం వంటి పనులకు ఇప్పుడు చాట్‌జీపీటీ మంచి చేదోడుగా నిలుస్తోంది. చాలామంది దీన్ని రోజువారీ వ్యవహారాల్లో తరచూ వాడుతూనే ఉంటారు. వెబ్ వర్షన్ కన్నా మొబైల్ వర్షన్ అనువుగా ఉంటుంది. షార్ట్‌కట్స్‌ను వాడుకుంటే నిరంతర సంభాషణ, ఇమేజ్ ఇన్‌పుట్ వంటి పనులు తేలికగా చేసుకోవచ్చు. అలాంటి కొన్ని దగ్గరి దారులేంటో చూద్దామా.
చాట్స్ డిలీట్‌కు స్వైపింగ్
చాట్‌జీపీటీ సైడ్ బార్ అంతా కలగాపులగంగా మారిందా? ఏ సంభాషణ దేనికి సంబంధించిందో తెలుసుకోలేక పోతున్నారా? చక్కబెట్టుకోవటానికి తేలికైన చిట్కా ఉంది. మొబైల్ యాప్ తెర మీద ఏ కన్వర్జేషన్ మీదైనా సరే తాకి, పక్కకు స్వైప్ చేయండి. పైన మూడు చుక్కల గుర్తు కనిపిస్తుంది. ఇది చాట్ పేరు మార్చుకోవటానికి, డిలీట్ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. దీంతో వర్క్ ప్రాజెక్టులు, వ్యక్తిగత ప్రశ్నల వంటి వాటిని చక్కగా ఒక దగ్గర సర్దుకోవచ్చు.
లాంగ్ ప్రెస్‌తో నిరంతర సంభాషణ
ఎదురుగా ఉన్న స్నేహితుడితో మాట్లాడినట్టుగా చాట్‌జీపీటీతో మాట్లాడాలని అనుకుంటున్నారా? అయితే తెర అడుగున ఉండే మైక్రోఫోన్ మీద కాసేపు అలాగే అదిమి పట్టుకుంటే సరి. ప్రత్యక్షంగా సంభాషించొచ్చు. ప్రశ్నలు వేయటం, జవాబులు అందుకోవటం అంతా సాఫీగా సాగుతుంది. వాయిస్ మెసేజ్‌లను రికార్డు చేయాల్సిన పనేమీ ఉండదు. ఎంచక్కా ఇంటి పని, డ్రైవింగ్ వంటి పనులు చేసుకుంటూనే చాట్‌జీపీటీతో మాట్లాడొచ్చు.
కెమెరాతో క్విక్ ఇమేజ్ ఇన్‌పుట్
మనం చూస్తున్న వాటినీ చాట్‌జీపీటీ విశ్లేషించగలదు. కాకపోతే అవేంటో దానికి చూపించాలి. ఇందుకు మొబైల్ యాప్‌లో కెమెరా ‘కన్ను’ను వాడుకుంటే సరి. మెసేజ్ బాక్స్‌లో ప్లస్ బటన్ మీద తాకి, కెమెరాను ఎంచుకొని నేరుగా స్నాప్ తీయాలి. అంతే తక్షణం చాట్‌జీపీటీ దాన్ని విశ్లేషించి, వివరణ ఇస్తుంది. అడిగిన ప్రశ్నలకు జవాబులు చెబుతుంది. హోటల్‌కు వెళ్లినప్పుడు మెనూ అర్థం కానప్పుడో, కఠినమైన లెక్కలు చేస్తున్నప్పుడో ఇదెంతగానో ఉపయోగపడుతుంది.
ఫైల్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ (ఐఓఎస్‌లోనే)
ఐఫోన్ లేదా ఐప్యాడ్ వారికైతే మరింత సులభమైన చిట్కా అందుబాటులో ఉంది. మెయిల్, ఫొటోస్, ఫైల్స్ నుంచి ఫొటోలు లేదా ఫైళ్లను నేరుగా చాట్‌జీపీటీలోకి డ్రాగ్ చేయొచ్చు. అప్పుడది వీటిని అప్‌లోడ్స్ మాదిరిగానే పరిగణిస్తుంది. వాటికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులిస్తుంది. సారాంశాన్ని గుది గుచ్చుతుంది. వివరణాత్మకంగా విశ్లేషిస్తుంది. పీడీఎఫ్స్, డాక్స్ వంటి వాటిని సత్వరం చదవాల్సి వచ్చినప్పుడిది తక్షణం ఆదుకుంటుంది.
.jpg)




COMMENTS