ప్రొటీన్ అనగానే అది కండను వృద్ధి చేస్తుందనే విషయమే గుర్తుకొస్తుంది. నిజానికి ప్రొటీన్ ప్రయోజనాల్లో ఇదొక మచ్చుతునక మాత్రమే. కండ కేవలం బలా...
ప్రొటీన్ అనగానే అది కండను వృద్ధి చేస్తుందనే విషయమే గుర్తుకొస్తుంది. నిజానికి ప్రొటీన్ ప్రయోజనాల్లో ఇదొక మచ్చుతునక మాత్రమే. కండ కేవలం బలానికి, సౌందర్యానికి సంబంధించిందే కాదు. జీవక్రియ ఉత్తేజిత కణజాలంగానూ మనల్ని కాపాడుతుంది. ప్రొటీన్ ఎక్కువగా తీసుకునేవారిలో.. ముఖ్యంగా వృద్ధుల్లో మరణాల రేటు తక్కువగా ఉంటున్నట్టు గత సంవత్సరం జామా పత్రికలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది. ఎనిమిది వేలకు పైగా మందిని పదేళ్లకు పైగా పరిశీలించి మరీ ఈ విషయాన్ని గుర్తించారు.
ప్రొటీన్ మనకు కల్పించే రక్షణకు మూలం అమైనో ఆమ్లాలు. ముఖ్యంగా ల్యూసీన్ అనే అమైనో ఆమ్లం కండర ప్రొటీన్ సంశ్లేషణ ప్రక్రియకు తోడ్పడే ఎంటార్ మార్గాన్ని ప్రేరేపిస్తుంది. రోజువారీ పనుల్లో భాగంగా కండర ప్రొటీన్లు సైతం విచ్ఛిన్నమవుతుంటాయి. వీటిని శరీరం ఎప్పటి కప్పుడు తొలగించుకుంటుంది. అందువల్ల ఇవి తగ్గకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. మనం ప్రొటీన్‌ను తిన్నప్పుడు వాటిల్లోని అమైనో ఆమ్లాలను శరీరం సంగ్రహించుకుంటుంది. వీటిని ఎముకలకు అతుక్కునే కండరాలు తీసుకొని, కండర నిర్మాణ ప్రక్రియను మొదలెడతాయి. ఇలా కండరం మరమ్మతు కావటానికి తోడ్పడతాయి. జీవక్రియల్లోనూ ప్రొటీన్ గణనీయ పాత్ర పోషిస్తుంది.
ఇది ఘ్రెలిన్, జీఎల్‌పీ-1 వంటి ఆకలి హార్మోన్లను ప్రభావితం చేయటం ద్వారా కడుపు నిండిన భావన కలిగిస్తుంది. చిరుతిండి వైపు మనసు మళ్లకుండా చూస్తుంది. ఇలా రక్తంలో గ్లూకోజు, ఇన్సులిన్ మోతాదులు నియంత్రణలో ఉండటానికీ తోడ్పడుతుంది. అలాగే కొవ్వు మినహా ఇతర శరీర బరువు (లీన్ బాడీ మాస్) పెరగటానికీ దోహదం చేస్తుంది. విశ్రాంతి తీసుకునే సమయంలో జీవక్రియలు వేగంగా జరగటానికి తోడ్పడేది ఇదే. శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియా శరీరంలో కణ బ్యాటరీలుగా పనిచేస్తుంది. ఈ మైటోకాండ్రియాతో కూడిన కణజాలం కండరాల్లో పెద్దమొత్తంలో ఉంటుంది. అంటే కండ ఎంత ఎక్కువగా ఉంటే శక్తి అంత ఎక్కువగా ఉత్పత్తి అవుతుందన్నమాట. కొవ్వు కూడా బాగా కరుగుతుంది.
శరీరం శక్తి కోసం పిండి పదార్థాలను, కొవ్వులను మరింత బాగా వినియోగించుకుంటుంది. దీనంతటికీ ప్రొటీనే ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది. వ్యాయామం చేయలేని సందర్భాల్లో (ఉదా: మోకీళ్ల మార్పిడి) ప్రొటీన్, అమైనో ఆమ్లాలు అదనంగా తీసుకోవటం వల్ల కండ క్షీణించకుండా కాపాడుతున్నట్టూ అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు.. బరువు తగ్గటానికి వాడే సెమాగ్లుటైడ్ వాడేవారిలోనూ ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవటం మేలు చేస్తున్నట్టు, కండర మోతాదు తగ్గకుండా చూస్తున్నట్టూ వెల్లడైంది. ఇలా ప్రొటీన్ చేసే మేలు అంతా ఇంతా కాదు.
.jpg)
COMMENTS