రాష్ట్రంలో కూటమి ఐక్యతే కీలకమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పునరుద్ఘాటించారు. లేదంటే అభివృద్ధిలో ముందుకు వెళ్లడం సాధ్యం కాదని స్పష...
రాష్ట్రంలో కూటమి ఐక్యతే కీలకమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పునరుద్ఘాటించారు. లేదంటే అభివృద్ధిలో ముందుకు వెళ్లడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో సామాజిక మాధ్యమాల్లో కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై చట్టం తీసుకొస్తామని చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సిందేనని హెచ్చరించారు.
విశాఖలో నిర్వహించిన శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో నేతలకు పలు అంశాలపై జనసేన అధినేత పవన్ దిశానిర్దేశం చేశారు. కూటమి ఐక్యత చాలా ముఖ్యమని ఆ ఐక్యతను నేతలు తమ పనుల ద్వారానే నిలబెట్టాలని జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కల్యాణ్ సూచించారు. రాష్ట్రంలో కూటమి లేకపోతే అభివృద్ధిలో ముందుకు వెళ్లలేమని స్పష్టం చేశారు.
నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకూ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనే అంశంపైనా సమావేశంలో చర్చించారు. జనసేన పార్టీకి ఉన్న మంత్రిత్వ శాఖల ద్వారా ఎమ్మెల్యేలు తన నియోజకవర్గాల్లో ఏం అభివృద్ధి చేయవచ్చు, ఇతర శాఖలకు సిఫార్సు చేసి ఏ ప్రాజెక్టులు తీసుకురాగలమో గుర్తించాలన్నారు. రైతులకు త్వరితగతిన డబ్బులు జమ చేశామని, స్త్రీ శక్తి పథకం ఎంతో ఉపయోగకరమని ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్యేలకు పవన్ దిశా నిర్దేశం చేశారు.
శాసనసభాపక్ష సమావేశంలో నేతలు పలు తీర్మానాలు చేశారు. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ గ్రామసభలు, పల్లె పండుగ, అడవి తల్లిబాట కార్యక్రమాలు అమలు చేయడంపై అభినందనలు తెలుపుతూ మొదటి తీర్మానం చేశారు. సామాజిక మాధ్యమాల్లో విశృంఖల ధోరణులను అరికట్టి మహిళల గౌరవ మర్యాదలను కాపాడేలా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలను నిలువరించేలా బలమైన చట్టం అవసరమని తీర్మానించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమ్మిళితంగా సాగడానికి సహకరిస్తున్న ప్రధానమంత్రి మోదీ, సూపర్ సిక్స్ హామీల అమలు చేస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్నట్లు పవన్ చెప్పారు. నివేదికలన్నీ ఉన్నాయి, ఎవరు ఎక్కడ ఎలా వ్యవహరిస్తున్నారో తెలుస్తూనే ఉందంటూ నేతలను హెచ్చరించారు. కచ్చితంగా పనితీరు మార్చుకోవాలని, కార్యకర్తలకు చేరువగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారంటే మీ నియోజకవర్గం నుంచి ప్రభుత్వం వరకు మీరు వారధులుగా ఉంటారన్న ఆకాంక్షతోనేనన్న జనసేనాని, ఒక్కొక్కరికి పనితీరు నివేదికలు ఇచ్చి సమాధానాలు కోరినట్లు తెలుస్తోంది.
పదవులు రాలేదు అని చాలా మంది మాట్లాడుతున్నారని, పదవుల వ్యామోహంలో పడి మన మూలాలను మర్చిపోతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. కార్యకర్త ఇంటికి వెళ్లి ఒకరోజు నిద్ర చేసి వారి కష్టాలు తెలుసుకునే విధానం ప్రారంభించాలని గాజువాకకు చెందిన సురేష్ కుమార్ ఇచ్చిన సూచన బాగుందని పవన్ అన్నారు. ఈసారి విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు సురేష్‌కుమార్ ఇంటికే తొలుత వెళ్తానని చెప్పారు.
.jpg)
COMMENTS