తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో రికార్డు వర్షపాతం నమోదైంది. ఏపీ లోనూ పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి....
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో రికార్డు వర్షపాతం నమోదైంది. ఏపీ లోనూ పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నెలలో వరుస అల్పపీడనాలు ఏర్పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో.. రాబోయే రెండు వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా, రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్షాల అలెర్ట్ జారీ అయింది.
నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. వారం రోజులుగా పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళా ఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ నెల 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. అదే విధంగా తర్వాత వెనువెంటనే అల్పపీడనాలు ఏర్పడతాయని, తుపాన్లుగా బలపడే పరిస్థితులు ఉన్నాయని కొన్ని వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి.
ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ఆగస్టు 12 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, హైదరాబాద్ లో గురువారం (ఆగస్టు 7) రాత్రి వాన దంచికొట్టింది. నగరమంతా కుండపోత వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. భారీ వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దైంది. వర్షం ధాటికి పలు బస్తీలు, కాలనీలు, రహదారులపై భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో చెరువులను తలపించాయి. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. వర్షాల కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. గంట వ్యవధిలోనే ఏకంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇదే సమయంలో తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించింది.
వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీలోని పలు జిల్లాల్లో రానున్న రెండు వారాల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. సెప్టెంబర్ కల్లా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని ఆరు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు, రేపు హైదరాబాద్ తోపాటు తెలంగాణ లోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

COMMENTS