ర్యాలీలో పాల్గొన్న ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవిందబాబు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ తెలుగుదేశం జెండా అంటే ...
ర్యాలీలో పాల్గొన్న ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవిందబాబు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్
తెలుగుదేశం జెండా అంటే నమ్మకానికి, రక్షణకు ప్రతిరూపమని, పార్టీకోసం శ్రమిస్తున్న టీడీపీ సైనికుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, వారి రక్షణతో పాటు వారి కుటుంబాల సంరక్షణ బాధ్యతల్ని భుజాన వేసుకున్న నాయకుడు చంద్రబాబని, అటువంటి నాయకత్వంలో పనిచేయడం మనందరి అదృష్టమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.
చిలకలూరిపేట ఏ.ఎం.సీ ఛైర్మన్ గా నియమితులైన షేక్ కరిముల్లా, వైస్ ఛైర్మన్ పిల్లి కోటేశ్వరరావులకు, ఇతర సభ్యులకు ప్రత్తిపాటి, మంత్రి గొట్టిపాటి రవి, ఎంపీ కృష్ణదేవరాయలు, కొమ్మాలపాటి, అరవిందబాబు ప్రత్యేక అభినందనలు తెలియచేశారు. పేరుపేరునా పలకరించి, ప్రజలు మెచ్చేలా పనిచేయాలని, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు.
చిలకలూరిపేట ఏ.ఎం.సీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకొని మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గా నియమితులైన షేక్ కరిముల్లా (టీడీపీ కరిముల్లా) నివాసమైన గుర్రాల చావిడి ప్రాంతం నుంచి అట్టహాసంగా కూటమి నాయకులతో హర్షదానాలతో ప్రారంభమైన ర్యాలీ చౌత్రా సెంటర్, ఎన్.ఆర్.టీ కూడలి మీదుగా మార్కెట్ యార్డ్ వరకు సాగింది. చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారసభకు హాజరైన కూటమిపార్టీల శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎంపీ కృష్ణదేవరాయలు మాట్లాడారు.
మూడుపార్టీల సమిష్టి పోరాటంతో వైసీపీ అడ్రస్ గల్లంతే
వైసీపీ విషప్రచారాన్నే నమ్ముకుందని, జగన్ అతని బృందాన్ని కోలుకోలేనివిధంగా దెబ్బకొట్టాలంటే టీడీపీతో పాటు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పోరాడాలని, అప్పుడే వైసీపీ అడ్రస్ గల్లంతు అవుతుందని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా పార్టీకోసం కష్టపడిన నాయకులకు సరైన పదవులు లభించడంలేదన్న ప్రత్తిపాటి. టీడీపీ అధినేత..మన ప్రియతమ నాయకులు చంద్రబాబుపై గౌరవంతో ప్రజలకోసం ఒక సత్సంకల్పంతో పనిచేయాలన్నారు. సూపర్-6.. సూపర్ హిట్ పేరిట సెప్టెంబర్ 6న అనంతపురంలో నిర్వహించే భారీసభను కూటమిశ్రేణులు కనివినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని ప్రత్తిపాటి పిలుపునిచ్చారు. జగన్ ఖాళీఖజానా అప్పగించినా, విధ్వంసపు పాలన చేసినా, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలుచేస్తూ.. మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చేందుకు చంద్రబాబు 75 ఏళ్ల వయసులో తీవ్రంగా కష్టపడుతున్నారనే నిజాన్ని టీడీపీ శ్రేణులు గుర్తించాలన్నారు. ఆయన కష్టంతో పోలిస్తే పదవులు..గుర్తింపుపట్ల ఉండే అసంతృప్తి చాలా చిన్నదన్నారు. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కూడా మూడుపార్టీల శ్రేణులు ఐక్యంగా పనిచేయాలన్న ప్రత్తిపాటి.. ఆధిపత్య ధోరణి వీడి అందరూ రాష్ట్రహితంకోసం పనిచేయాలన్నారు. మన నాయకుడికి చేదోడుగా అందరం ఒకేతాటిపై నిలిచినప్పుడే కూటమిప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉంటుందని, అప్పుడే రాష్ట్రం ప్రగతిపథాన నిలిచి దేశంలోనే నంబర్ 1గా నిలుస్తుందని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ నాయకత్వం పల్నాడుజిల్లా ప్రజలకు నిజంగా అదృష్టమన్న ప్రత్తిపాటి, ప్రతి నాయకుడిని కార్యకర్తలను సంతోషపెట్టడమే లక్ష్యంగా ఎంపీ కృష్ణదేవరాయలు పనిచేస్తున్నారన్నారు. పదవుల తీసుకోవడంలో పాటు.. ప్రజల హృదయాల్లో నిలిచేలా, రైతుల మేలుకోసం మార్కెట్ యార్డ్ నూతన కమిటీ సభ్యులు పనిచేయాలని ప్రత్తిపాటి సూచించారు.
కరిముల్లా వ్యక్తిత్వం.. నాయకత్వ లక్షణాలే ఆయనకు గుర్తింపునిచ్చాయి, పిల్లికోటి పులిలా గత పాలకులు దుర్మార్గాలపై పోరాడాడు : ప్రత్తిపాటి
టీడీపీ కరిముల్లా వ్యక్తిత్వం.. నాయకత్వ లక్షణాలు.. అందరినీ కలుపుకుపోయే మంచితనం పరిగణనలోకి తీసుకున్నాకే పార్టీ అధినాయకత్వం ఆశీస్సులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, తాను చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గా ఆయన్ని ఎంపిక చేశామని, తెలుగుదేశం పార్టీ తనదన్న ధృఢచిత్తం.. నమ్మకంతో పార్టీకోసం కరిముల్లా సమర్థవంతంగా పనిచేశాడని ప్రత్తిపాటి కొనియాడారు. వైస్ ఛైర్మన్ గా ఎన్నిక కాబడిన పిల్లి కోటేశ్వరరావు.. గత పాలకుల దుర్మార్గాలు, అవినీతిపై పులిలా పోరాడాడని, ముక్కూ.. ముఖం తెలియని మాజీ అవినీతి మంత్రి తనను ఎంతగా ఇబ్బందిపెట్టినా పిల్లి కోటి ధైర్యంగా నిలబడ్డాడన్నారు.
రాబోయే రోజుల్లో చంద్రబాబు రెట్టింపు సంక్షేమం.. మునుపెన్నడూ చూడని అభివృద్ధిని అందిస్తారు : ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాదిలో ప్రజలకు అందించిన సుపరిపాలన కంటే .. రాబోయే కాలంలో ప్రజలకు రెట్టింపు సంక్షేమాన్ని, మునుపెన్నడూ చూడని అభివృద్ధిని అందిస్తారని, ఆయన ఆలోచనలు..పనితీరుకు మనం ఎప్పుడూ అండగా నిలిస్తే చాలని ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలిపారు.
ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన స్త్రీశక్తి పథకం (ఉచిత బస్సు ప్రయాణం) తమ కాళ్లపై నిలబడి బతికే ఎంతో మంది మహిళలకు ఉపకరిస్తుందని, పథకాన్ని దుర్వినియోగం చేసే వారికంటే, సద్వినియోగపరుచుకునేవారే ఎక్కువ ఉన్నారని ఎంపీ చెప్పారు. పథకం ప్రవేశపెట్టారన్న ఉత్సాహంతో మహిళలు పుణ్యక్షేత్రాలకు, ఇతర ప్రదేశాలకు తిరగడమనేది ఎక్కువకాలం కొనసాగదన్నారు. సూపర్ -6 పథకాలు ప్రజల మనసుల్లో నాటుకుంటే వైసీపీ ఎంతగా ప్రయత్నించినా వారికి చేరువ కాలేదని ఎంపీ తేల్చిచెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ పనితీరుపై ప్రజలమధ్య సమర్థవంతమైన వాదనలు చేయాలన్నారు. చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ గా ఎంపికైన కరిముల్లా.. పిల్లికోటేశ్వరరావు సహా మొత్తం పాలకవర్గసభ్యులు తమకు అప్పగించిన పదవులతో పార్టీకి.. ప్రజలకు, ప్రభుత్వానికి మంచి పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని ఎంపీ కృష్ణదేవరాయలు సూచించారు. మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గం రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని, వ్యవసాయాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కృష్ణదేవరాయలు సూచించారు. మార్కెట్ యార్డ్ పరిథిలోని స్థలాన్ని పాలకవర్గం ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ అధ్యక్షుడు ఏలూరి శశికుమార్, నాయకులు శివనాగేశ్వరరావు, జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టిడిపి, జనసేన, బీజేపీ పార్టీలలో వివిధ హోదాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.





COMMENTS