ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతుంటారు. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, పూర్వ విద్యార్థులు, ఉద్యోగులు, కార్యాలయాల...
ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతుంటారు. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, పూర్వ విద్యార్థులు, ఉద్యోగులు, కార్యాలయాలు వంటి రకరకాల గ్రూపులు ఉంటున్నాయి. చాలా మంది పదుల సంఖ్యల గ్రూపుల్లో సభ్యులుగా ఉంటున్నారు. అయితే.. ఇటీవల ఆయా గ్రూప్ పేర్లు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఎవరూ మార్చకుండానే ‘స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా’గా మారిపోతోంది. ఇలా అయ్యిందంటే.. మీ గ్రూప్ హ్యాక్ అయినట్లే.
లింక్ వచ్చిందని..: యోగక్షేమాలు తెలుసుకునేందుకు, వివిధ వేడుకల సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం, శుభాకాంక్షలు తెలుపుకొనేందుకు బంధువులంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల అకస్మాత్తుగా గ్రూప్ పేరు ‘యోనో ఎస్‌బీఐ’ లోగోతో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’గా మారిపోయింది. అందులోని ఒక సభ్యుడి పేరుతో ‘యోనో ఎస్‌బీఐ పాన్ అప్‌డేట్.ఏపీకే’ పేరుతో ఒక లింక్ వచ్చింది. వెంటనే ఒక సభ్యుడు అప్రమత్తం అయ్యారు. అది వైరస్ ఫైల్ అని, ఎవరూ క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. దాన్ని ఎవరూ క్లిక్ చేయకపోవటంతో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా తప్పించుకున్నారు.
అసలేం జరిగిందంటే...: గ్రూప్‌లోని ఒక సభ్యుడు తనకు వచ్చిన ఒక లింక్‌ను క్లిక్ చేశారు. అది వైరస్ ఫైల్ కావడంతో అతని చరవాణి హ్యాక్ అయింది. హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ‘యోనో ఎస్‌బీఐ పాన్ అప్‌డేట్’ పేరుతో వైరస్ ఏపీకే ఫైల్‌ను తయారు చేసి ఆ గ్రూప్ సభ్యుడి చరవాణిలో ఉన్న కాంటాక్ట్ నంబర్లన్నింటికీ వారే పంపించేశారు. అంతేకాదు.. అతను ఉన్న ఇతర వాట్సాప్ గ్రూప్‌లన్నింటిలోకి అతని పేరుతో ‘యోనో ఎస్‌బీఐ పాన్ అప్‌డేట్.ఏపీకే’ వైరస్ ఫైల్ వెళ్లిపోయింది.
అప్రమత్తత అవసరం: వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న వారంతా ఇలాంటి సంఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు సైబర్ క్రైం సీఐ గుణరాం. గ్రూప్‌లోని సభ్యుల పేరుతో ‘ఏపీకే’ ఫైల్ వచ్చినా.. దాన్ని క్లిక్ చేయవద్దు. ఒకవేళ ఎవరైనా తెలియక క్లిక్ చేస్తే.. క్షణాల వ్యవధిలో దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.
వెంటనే సదరు వాట్సాప్ గ్రూప్ నుంచి బయటకు వచ్చేయాలి.
చరవాణిని ఫార్మాట్ చేయాలి.
కంప్యూటర్ లేదా లాప్‌టాప్‌లో మీ బ్యాంకుకు సంబంధించిన ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు వెళ్లి.. మీ ఖాతా పాస్‌వర్డ్‌లు మార్చేసుకోవాలి.
ఖాతాల నుంచి డబ్బులు పోతే వెంటనే సైబర్ క్రైం పోర్టల్ 1930కు ఫిర్యాదు చేయండి.
గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే.. పోయిన డబ్బును వెనక్కి తీసుకువచ్చేందుకు వీలవుతుంది.
బ్యాంకింగ్‌కు లింక్ అయిన చరవాణి నంబరుకు వాట్సాప్ లేకుండా చూసుకోండి. బ్యాంకింగ్ లావాదేవీల సిమ్ కోసం ప్రత్యేకంగా ఒక చరవాణి పెట్టుకోండి.
వేరే నంబరుకు వాట్సాప్ ఉండి, అదే చరవాణిలో మీ బ్యాంకింగ్ లావాదేవీల సిమ్ ఉంచవద్దు. అలా చేసినా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.
క్లిక్ చేస్తే... ఖాతా ఖాళీ: వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న వారు తమ గ్రూప్‌లోని సభ్యుడి పేరుతో వచ్చిన ఆ ఫైల్‌ను తెలియక క్లిక్ చేస్తే.. వెంటనే వారి చరవాణి కూడా హ్యాక్ అవుతుంది. చరవాణిలో బ్యాంకింగ్ ఖాతాలు, యూపీఐ ఖాతాలు, పాస్‌వర్డ్‌లు ఇతరత్రా సమస్త సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరిపోతుంది. వాటిని ఉపయోగించి.. మీ ఖాతాలను నిమిషాల్లో ఖాళీ చేసేస్తారు.

COMMENTS