స్థానిక సంస్థలకు నేరుగా నిధులు పంపిణీ చేయడం ద్వారా అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్...
స్థానిక సంస్థలకు నేరుగా నిధులు పంపిణీ చేయడం ద్వారా అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. 2026-27 నుంచి 2030-31 వరకు రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు రూ.62,515 కోట్ల మేర నిధుల లోటు ఉంటుందని అంచనా వేసినట్టు తెలిపారు. 13,371 గ్రామ పంచాయతీలు, 660 మండల పరిషత్తులు, 26 జిల్లా పరిషత్తులకు ఆర్థిక స్వయంప్రతిపత్తి కల్పించి బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర సచివాలయంలో 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో సమావేశం సందర్భంగా ఆయన పలు విషయాల్ని ప్రస్తావించారు. ‘‘పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ఆర్థిక సంఘం సహాయ సహకారాలు ఎంతో అవసరం. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో గ్రామాలు కీలకం. ప్రతి గ్రామాన్ని డిజిటల్ పంచాయతీగా మార్చేందుకు వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. స్థానిక ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాల్ని మెరుగుపరచడం ద్వారా ఆర్థికవృద్ధికి అవకాశాలు కలుగుతాయి. గ్రామీణ పంపిణీ హబ్‌ల ఏర్పాటు, రహదారుల మరమ్మతులు చేస్తున్నాం.కలప మొక్కల పెంపకం, ఎకో టూరిజం అభివృద్ధి, సినిమా, మీడియా వ్యవస్థల నిర్వహణకు అనువైన వాతావరణం కల్పిస్తున్నాం’’ అని పవన్‌కల్యాణ్ వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్లు ఇంటిపన్నును వసూలు చేసినట్లు పేర్కొన్నారు.

COMMENTS