రాణి చెన్నమ్మ కెలడి అనే రాజ్యాన్ని 25 సంవత్సరాల పాటు (1671–96) పాలించింది. కర్ణాకటలోని మల్నాడు ప్రాంతంలోని ఒక రాజ్యం కెలడి. సోమశేఖరుడు 1664...
రాణి చెన్నమ్మ కెలడి అనే రాజ్యాన్ని 25 సంవత్సరాల పాటు (1671–96) పాలించింది. కర్ణాకటలోని మల్నాడు ప్రాంతంలోని ఒక రాజ్యం కెలడి. సోమశేఖరుడు 1664లో సింహాసనాన్ని అధిష్టించాడు. అతని భార్య చెన్నమ్మ. ఏ రాజవంశానికీ చెందని చెన్నమ్మను సోమశేఖరుడు ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత చెన్నమ్మ రాజ్య వ్యవహారాల్లో అనేక మెలకువలు తెలుసుకొంది. ఆయుధాలు ఉపయోగించటం నేర్చుకుంది. భర్త అనారోగ్యం కారణం రాజ్యాధికారాన్ని చేపట్టిన చెన్నమ్మ ఇతర రాజులకు ఏమాత్రం తీసిపోని విధంగా రాజ్యపాలన చేసింది. సొంత రాజ్యంలో తలెత్తిన కుట్రదారులను అణచివేసింది. శత్రురాజ్యాల చేతుల్లోకి వెళ్లిపోతున్న రాజ్యాన్ని కాపాడింది.ఉత్తర భారతాన్ని జయించిన ఔరంగజేబు దక్షిణ భారతంలో రాజ్యాలపై దాడులు చేసేటప్పుడు చిన్న రాజ్యం అయిన కెలడిని కూడా విడిపెట్టలేదు. రాణి చెన్నమ్మ ఛత్రపతి శివాజీ కుమారుడు అయిన రాజారావుకి ఆశ్రయం ఇచ్చిందనే కారణంతో ఔరంగజేబు ఆ రాజ్యంపై దాడికి సిద్ధపడ్డాడు. అతనికి భయపడిన అనేకమంది హిందూ రాజులు రాజారావుకి ఆశ్రయం ఇవ్వటానికి నిరాకరించారు. కాని చెన్నమ్మ ఔరంగజేబుకు ఏ మాత్రం భయపడ కుండా రాజారావుకు ఆశ్రయమిచ్చింది. అతని సైన్యం తో తలపడటానికి తన సైన్యాన్ని సిద్ధం చేసింది.
అయితే యుద్ధ్దం ప్రారంభమయ్యే నాటికే రాజారావు జింజికోటకు వెళ్లి పోయాడు. ఔరంగజేబు కుమారుడు ఆజ్మాత్ ఆరా తన సైన్యంతో కెలడిపై దాడికి వచ్చాడు. అడవి మార్గంలో కుండపోతగా వర్షం కురుస్తుండడంతో మొగల్ సైనికులు కెలడి సైన్యాన్ని ఎదుర్కోలేకపోయారు. కెలడి సైనికులు అనేకమంది మొగల్ సైనికాధికారుల్ని బంధించారు. ఈ లోగా రాజారావు జింజికోటలో ఉన్నాడని తెలుసుకున్న ఔరంగజేబు తన సైన్యాన్ని వెనక్కి రమ్మని వర్తమానం పంపాడు.
ఔరంగజేబు కుమారుడు చెన్నమ్మతో సంధికుదుర్చుకుని, ఆమెను వీరవనితగా కీర్తించాడు.
తనకు ఆశ్రయం ఇచ్చిన చెన్నమ్మ ధైర్యాన్ని మెచ్చుకుంటూ రాజారాం వర్తమానం పంపిం చాడు.
అలా రాణి చెన్నమ్మ కర్ణాటక చరిత్రలో,భారతీయ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకుంది.
COMMENTS