హార్మోన్లు అంటే ఏమిటి ? హార్మోన్లు పాలీపెస్టైడ్‌తో నిర్మితమైన రసాయన వాహకాలు. ఇవి శరీరంలో ఒక ప్రాంత కణజాలం , అవయవాల నుండి ఉత్పత్తి అయి , వివి...
హార్మోన్లు అంటే ఏమిటి?
హార్మోన్లు పాలీపెస్టైడ్‌తో నిర్మితమైన రసాయన వాహకాలు. ఇవి శరీరంలో ఒక ప్రాంత కణజాలం, అవయవాల నుండి ఉత్పత్తి అయి, వివిధ శరీర భాగాలకు రక్తం ద్వారా ప్రవహించి నిర్దిష్ట అవయవాన్ని ప్రభావితం చేసి జీవప్రక్రియల సమతుల్యతకు తోడ్పడుతాయి. ఈ హార్మోన్‌లు ఎండోక్రైన్, ఎక్సోక్రైన్ గ్రంథుల నుండి ఉత్పత్తి అవుతాయి.
హార్మోన్ సమస్యలు
మారుతున్న కాలంలో హైపోథైరాయిడ్, పీసీఓడీ, సంతానలేమి, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక జబ్బుల గురించి వింటున్నాము. ఇవన్నీ హార్మోన్ అసమతుల్యతల వలన వచ్చే జబ్బులే. ఇవి కాకుండా ఇంకా చాలా హార్మోన్‌లు మానవ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి.
ఇవి మానవ శరీరంలో సూక్ష్మ మోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ, వీటి ప్రభావం వలన శరీరంలోని వివిధ సాధారణ జీవక్రియలైన జీర్ణక్రియ, శారీరక, మానసిక ఎదుగుదల, ప్రత్యుత్పత్తి, మానసిక సమతుల్యత వంటి` ` జీవక్రియలకు తోడ్పడతాయి. మానవుడిలో ఈ హార్మోన్‌లు అసమతుల్యతకు గురి అయినప్పుడు తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతాడు.
వివిధ హార్మోన్‌లు-వాటి అసమతుల్యతల వలన వచ్చే పరిణామలు :
- థైరాయిడ్ హార్మోన్‌లు (T3, T4): ఇవి థైరాయిడ్ గ్రంథి నుండి ఉత్పత్తి అవుతాయి. వీటి ప్రభావం 90 శాతం మానవుడి జీవనక్రియలపై ఉంటుంది. వీటి అసమతుల్యత వలన హైపోథైరాయిడ్, హైపర్‌థైరాయిడ్, గాయిటర్ అనే దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి.
- హైపోథైరాయిడ్ లక్షణాలు : బరువు పెరగడం, జుట్టు రాలడం, నీరసం, మతిమరుపు, ఋతుచక్రంలో మార్పులు మొదలైన వాటికి దారితీస్తుంది.
- హైపర్‌థైరాయిడ్ లక్షణాలు : బరువు తగ్గడం, నీరసం, గుండెదడ, కాళ్ళు చేతులు వణకడం మొదలైన సమస్యలకు దారి తీస్తుంది.
- గాయిటర్ : గొంతుకింద ఉండే థైరాయిడ్ గ్రంథి వాపునకు గురి అవటాన్ని గాయిటర్ అంటాము. ఇది ముఖ్యంగా అయోడిన్ లోపం వలన వస్తుంది. ఇది హైపో, హైపర్ థైరాయిడ్ సమస్యలతో కూడుకుని ఉండవచ్చు.
స్త్రీలలో ఉండే హార్మోన్‌లు
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్, ప్రొలాక్టిన్, ఆక్సిటాసిన్ హార్మోన్‌లు స్త్రీలలో రజస్వల, ఋతుచ్రకం, ద్వితీయ లైంగిక లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవంలో ఉపకరిస్తాయి. ఈ హార్మోన్‌లు అసమతుల్యతల వలన స్త్రీలలో ఋతుచక్ర సమస్యలు, అవాంఛిత రోమాలు మరియు సంతానలేమి సమస్యల దారి తీస్తాయి. స్త్రీలలో మెనోపాజ్, రజస్వల అయ్యే సమయంలో హార్మోన్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మెనోపాజ్‌లో హార్మోన్ హెచ్చుతగ్గుల వలన మానసిక అశాంతి, నీరసం, కీళ్ళు, కండరాల నొప్పులు వస్తాయి.
పురుషులలో ఉండే హార్మోన్‌లు
టెస్టోస్టిరాన్: ఇది పురుషులలో ఉండే హార్మోన్. దీని అసమతుల్యతల వలన శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సమస్యలు, శుక్రకణ సమస్యలు, సంతానలేమి సమస్యలు వస్తాయి.

COMMENTS