ప్రజా సమస్యల పరిష్కార వేదికలో శానసభ్యులు ప్రత్తిపాటి. ఆటోనగర్ అవసరాలకు అదనపు భూమిని సేకరించాల్సి ఉందని, సమస్యపై ఉన్నతాధికారులతో...
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో శానసభ్యులు ప్రత్తిపాటి.
ఆటోనగర్ అవసరాలకు అదనపు భూమిని సేకరించాల్సి ఉందని, సమస్యపై ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నానని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందని స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.
శుక్రవారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) నిర్వహించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక ఆటోనగర్ వర్కర్స్ యూనియన్ విభాగం సభ్యులు ప్రత్తిపాటిని కలిసి తమకు కొత్తప్లాట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వారి విన్నపంపై స్పందించిన ప్రత్తిపాటి.. ఇప్పుడున్న ఆటోనగర్ 42 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, మోటార్ వర్కర్స్ సంఖ్య పెరిగినందున వారి అవసరాలకు సరిపడా భూమిని సేకరించాల్సి ఉందని, అందుకోసం మరో 10 ఎకరాలు సేకరణపై దృష్టి పెట్టామని, దీనిపై ఇప్పటికే అధికారులతో మాట్లాడటం జరిగిందని ప్రత్తిపాటి చెప్పారు. ఆటోనగర్ వర్కర్స్ లో మరో 100 మంది కొత్తగా ప్లాట్లు కోరుతున్నందున, ప్రభుత్వం తప్పకుండా సమస్య పరిష్కరిస్తుందని, ఆటోవర్కర్స్ ఆందోళన చెందాల్సిన పనిలేదని, అర్హులైన వారికి ప్లాట్లు కేటాయిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
నీటి వినియోగం పెరిగినందున నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడండి.
తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను పలువురు పట్టణవాసులు ప్రత్తిపాటికి తెలియచేశారు. వేసవితీవ్రత దృష్ట్యా నీటి వినియోగం పెరుగుతున్నందున, శివారు ప్రాంతాలకు సకాలంలో పరిశుభ్రమైన తాగునీరు సరఫరా అయ్యేలా చూడాలని, అధికారులు...సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసి, ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ప్రత్తిపాటి సూచించారు. వీధిలైట్ల ఏర్పాటు, సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, పారిశుధ్య సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలు స్వీకరించిన ప్రత్తిపాటి, రోజుల వ్యవధిలోనే సమస్యలన్నీ పరిష్కారం కావాలని మున్సిపల్ అధికారుల్ని ఆదేశించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ సహకారంతో పాటు, దాతల ఆర్థికసాయంతో వాటిని సమర్థవంతంగా నిర్వహించాలని ప్రత్తిపాటి స్పష్టం చేశారు.
కార్యక్రమంలో సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS