చిలకలూరిపేటలో గ్యాస్ మాఫియా సెగ.. చిలకలూరిపేట: పట్టణంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారిందని, పేద ప్రజలకు ...
చిలకలూరిపేటలో గ్యాస్ మాఫియా సెగ..
చిలకలూరిపేట: పట్టణంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారిందని, పేద ప్రజలకు అందాల్సిన సిలిండర్లు దర్జాగా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయని మాజీ కౌన్సిలర్ అబ్దుల్ రౌఫ్ మండిపడ్డారు. గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు, కొందరు అధికారులు కుమ్మక్కై సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
*మాజీమంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించినా మారని తీరు*
గతంలో మాజీ మంత్రి,శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను, డెలివరీ బాయ్స్‌ను కఠినంగా హెచ్చరించారు. సామాన్య మానవుడికి కేటాయించిన గృహ వినియోగ సిలిండర్లు వారికే అందాలని, హోటళ్లు మరియు వ్యాపార సంస్థలు కేవలం కమర్షియల్ సిలిండర్లనే వాడాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే, స్వయంగా శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించినప్పటికీ, గ్యాస్ ఆఫీస్ వారు ఏమాత్రం భయం లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని రౌఫ్ విమర్శించారు. వారికి ఎమ్మెల్యే అన్నా, నిబంధనలన్నా గౌరవం లేదని ధ్వజమెత్తారు.
అధికారుల తనిఖీలు ఒక ప్రహసనం..
ఇటీవల విజిలెన్స్ అధికారులు చేసిన తనిఖీలపై అబ్దుల్ రౌఫ్ విస్మయం వ్యక్తం చేశారు. పట్టణం మొత్తం మీద కేవలం మూడు సిలిండర్లు పట్టుకోవడం హాస్యాస్పదమని, అధికారులు చిత్తశుద్ధితో తనిఖీలు చేయడం లేదని ఆరోపించారు. "నాతో కలిసి వస్తే పట్టణంలో వందల సంఖ్యలో అక్రమ సిలిండర్లను పట్టిస్తాను" అని ఆయన అధికారులకు సవాల్ విసిరారు. అధికారులు కేవలం డబ్బులకు ఆశపడి, నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆఫీసుల్లో సామాన్యుడికి బెదిరింపులు.. విఆర్ ఏ లకు వీఐపీ ట్రీట్మెంట్..
తాను స్వయంగా ఇండియన్ గ్యాస్ ఆఫీసులో గమనించిన అక్రమాలను రౌఫ్ వివరించారు. సామాన్యులు వెళ్లి సిలిండర్ అడిగితే 'వస్తాయి.. వెళ్ళండి' అంటూ సిబ్బంది బెదిరించి పంపిస్తున్నారని, అదే సమయంలో తన కళ్లముందే ఇద్దరు విఆర్ ఏ (VRA) ల వద్ద వెయ్యి రూపాయలు తీసుకొని వెంటనే స్లిప్పులు రాసి సిలిండర్లు ఇచ్చారని ఆయన వెల్లడించారు. తాను గ్యాస్ బుక్ చేసి 12 రోజులు గడుస్తున్నా ఇంతవరకు డెలివరీ చేయలేదని, సామాన్యుడి పరిస్థితి ఇంత దారుణంగా ఉందని వాపోయారు.
పై అధికారుల జోక్యానికి డిమాండ్..
నర్ల బజార్ వంటి ప్రాంతాల్లో గృహ వినియోగ సిలిండర్లు హోటళ్లు, కర్రీ పాయింట్లకు యథేచ్ఛగా సరఫరా అవుతున్నాయని, దీనివల్ల సామాన్యుడు వారాల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఈ అక్రమాలపై జిల్లా పౌర సరఫరా అధికారి (DSO), ఆర్డీఓ (RDO) తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని, అక్రమాలకు పాల్పడుతున్న గ్యాస్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రౌఫ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
COMMENTS