అందమైనఅమ్మాయిదరహాసాన్నీ స్వచ్ఛమైన మనసునీ మరుపురాని తీపిగుర్తుల్నీ మనసు పలికే మౌనరాగాలన్నీ తొలివలపు గిలిగింతల్నీ తలపించే సుందర సు...
అందమైనఅమ్మాయిదరహాసాన్నీ స్వచ్ఛమైన మనసునీ మరుపురాని తీపిగుర్తుల్నీ మనసు పలికే మౌనరాగాలన్నీ తొలివలపు గిలిగింతల్నీ తలపించే సుందర సుకుమార కుసుమాలే మల్లెలు....
చిరుగాలుల తాకిడికి అల్లంత దూరం నుంచి తేలి వచ్చే వాటి మధురమైన పరిమళం సోకగానే ముసలి వాళ్ళలో సైతం మది సన్నాయి గీతాన్ని ఆలపిస్తుంది. మోహనరాగాల్నిపలికిస్తుంది.మధురోహాలతో పులకిస్తుంది.వలపు వానల్ని కురిపిస్తుంది.ఇక పడుచు వారి గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది
అదే..మరుమల్లెలపరిమళాల గుబాలింపులోని గొప్పతనం! అందుకే
ఇదిమల్లెలవేళయనీ..మల్లెపందిర నీడలోన జాబిల్లి...
అని కొందర బావ కవులు కలాల నుంచి సాహితీ సౌరభాలు కురిపించి, గాయకుల గొంతుల్లో రాగాలు పలికిస్తే...మరికొందరు కవులు
మల్లియెల్లో మల్లీయెల్లో మరదల పిల్లో...మల్లికా నవ మల్లికా..మల్లెపూల మారాణి...అంటూ మల్లెల సౌందర్యాన్ని ప్రేయసికి ఆపాదించి వాటి మీదున్న ప్రేమను చాటుకున్నారు..
వేసవి లో పకృతి వరం..
వేసవి వడగాల్పులను తెస్తుందని, ఉక్కపోత ఒంటికి చిరాకు పుట్టిస్తుందని బాధపడే వారందరి కోసం ఈ మల్లెలు వరంగా మారుతుంటాయి.
మండు వేసవిలో మనసును మురిపించే సాధనాలు ఇవి.
పగలంతా ఎండల్లో చెమటలతో నరకం చూసే వారు సాయంత్రం అయ్యేసరికి ఆ తెల్లని పూలను, మైమరిపించే వాటి పరిమళాలను ఆస్వాదించి స్వర్గం అంటే ఇదే కదా అనుకుంటారు.అంతటి మాయ చేసే మల్లెల గుబాలింపు మార్చి, ఏప్రిల్, మే,జూన్ నెలల్లో ఉంటాయి.
మల్లెల అమ్మకాల జోరు...
ఈ మల్లెల సాగుకు, అమ్మకాలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కడియం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాలు ప్రసిద్ధి.కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్ ద్వారా ప్రతి ఏటా ఈ మల్లెల అమ్మకాలు భారీ గానే ఉంటాయి. ఎందరికో ఉపాధినిస్తాయి.
ఈ మార్కెట్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు ఆర్డర్ పై మల్లెలను ఎగుమతి చేస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్లో వీటిదే అగ్రస్థానం.
జడలో ఓ మూరెడు మల్లెపూలు పెట్టుకుని మహిళలు చేసే సందడి అంతా ఇంతా కాదు. మొదట రాత్రికైతే మొత్తం ఈ మల్లెపూలు తోనే పడక గది అలంకరణ సాగుతుంది.
ఇక బస్ స్టాపుల వద్ద ప్రయాణికులకు, వాహనదారులకు మల్లె పూల దండలు అమ్మడానికి పోటీ పడుతుంటారు.
పూలకు ప్రసిద్ధి చెందిన కడియం మండలంలోని కడియపులంక నుంచి వేమగిరి జాతీయ రహదారికి ఇరువైపున ఈ పూలమ్మకాలు జోరుగా సాగుతాయి.
వేసవి సెలవులకు చిన్నారులు ఈ మల్లెలు విక్రయిస్తూ డబ్బులు సంపాదన ఎలా ఉంటుందో అలవాటు చేసుకుంటారు.
ప్రాధమిక బడిలో చదువుకునే ఈ బుడతలు పూల అమ్మకాలలో బేరసారాలు సాగించే తీరు ముచ్చట గొలుపిస్తుంది.
మల్లెల రకాలు చాలా ఉన్నాయి
మల్లెల్లో సుమారు 40 రకాలు ఉంటాయి.
అయితే మన రాష్ట్రంలో అధికంగా పందిరి మల్లె, తుప్పమల్లె, జాజిమల్లి, కాగడా మల్లి, నిత్యమల్లి వంటి వాటిని విరివిగా సాగు చేస్తుంటారు.
ఎంత పరిమళ భరతమైన మల్లెలకైన జీవితకాలం కొద్ది గంటలు కావడంతో రైతులకు ఒక్కొక్క సారి సేదపరిమళాలే మిగులుతాయి.
మనసును మరులగొలుపే మల్లెలు కొందరికి ఆనందాన్ని మరికొందరికి ఆహ్లాదాన్ని కలిగించినా మొగ్గను మల్లిగా చేసే రైతులకు మాత్రం కొన్ని సందర్భాల్లో తీవ్ర నష్టాలు తెచ్చిపెడుతుంటాయి.
కొద్దిసేపు గుపాలించి వాడిపోయే మల్లెలు కొన్ని సమయాల్లో సిరులపంట కురిపిస్తాయనే ఆశతో రైతులు వీటిని సాగు చేస్తుంటారు.
ఒక్కోసారి కేజి రెండు నుంచి మూడు వేల రూపాయలు పలికే మల్లెలు ఒక్కసారిగా వందకు దిగువకు తగ్గిపోయి కోతకూలి రాని పరిస్థితి వస్తుంది.
ఇంత భారీ వ్యత్యాసం ఏ పువ్వులకు ఉండదని చెప్పవచ్చు.
COMMENTS