మానవత్వమే మకుటంగా.. ఎమ్మెల్యే ఆదర్శం.. చిలకలూరిపేట:రాజకీయ నాయకులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, ఆపదలో ఉన్నవారి కన్నీళ్లు తుడిచేవ...
మానవత్వమే మకుటంగా.. ఎమ్మెల్యే ఆదర్శం..
చిలకలూరిపేట:రాజకీయ నాయకులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, ఆపదలో ఉన్నవారి కన్నీళ్లు తుడిచేవారే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వైద్యం అందక, డబ్బు లేక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదనే సంకల్పంతో ఆయన చేసిన సాయం, ఒక నిరుపేద యువకుడికి పునర్జన్మను ప్రసాదించింది.
మృత్యువుతో పోరాడుతున్న ‘సాయి’ దీనగాథ..
చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన గుంటూరు రమాదేవి ఏకైక కుమారుడు గుంటూరు సాయి (22). చిన్న వయసులోనే రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో డయాలసిస్‌పై ఉంటూ మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ దీన స్థితిపై పత్రికల్లో వచ్చిన కథనం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి వెళ్లింది. వార్త చూసిన వెంటనే స్పందించిన ఆయన, రిపోర్టర్ మస్తాన్ వలికి ఫోన్ చేసి బాధితులను వెంటనే తన వద్దకు పంపాలని సూచించారు.
రూ. 9 లక్షల ఎల్ఓసీతో కొండంత అండ..
బాధితుల పరిస్థితిని చూసి చలించిన ఎమ్మెల్యే, పార్టీలకు అతీతంగా స్పందించారు. గత నెల మార్చి 4వ తేదీన ఏకంగా 9 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసీ మంజూరు చేయించారు. అంతటితో ఆగకుండా, గుంటూరులోని విశిష్ట హాస్పిటల్ యాజమాన్యంతో స్వయంగా మాట్లాడి, శస్త్రచికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, బాధితుల వద్ద నుంచి పైసా ఆశించవద్దని ఆదేశించారు.
తల్లి ప్రేమ.. ఎమ్మెల్యే భరోసా.. విజయవంతమైన ఆపరేషన్..
తల్లి ప్రేమకు మించింది లేదని నిరూపిస్తూ.. రమాదేవి తన కుమారుడికి ఒక కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే అందించిన ఆర్థిక సహాయం, వైద్యుల కృషితో నిన్న శుక్రవారం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం తల్లి, కుమారుడు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
జీవితాంతం రుణపడి ఉంటాం: బాధితురాలి ఆవేదన..
"నా కొడుకును ఎలా బ్రతికించుకోవాలో తెలియక కన్నీరు మున్నీరయ్యాను. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు దేవుడిలా వచ్చి మా కుటుంబాన్ని ఆదుకున్నారు. మా ప్రాణాలను నిలబెట్టిన ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం."
గుంటూరు రమాదేవి, బాధితుడి తల్లి..
సేవలో అగ్రగామిగా ‘ప్రత్తిపాటి’..
రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్లను అత్యధికంగా ఇప్పించిన నేతగా గుర్తింపు పొందిన ప్రత్తిపాటి పుల్లారావు, మరో ప్రాణాన్ని నిలబెట్టి నియోజకవర్గ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన చూపిన ఈ చొరవ నిరుపేదలకు కొండంత ధైర్యాన్ని ఇస్తోంది.
COMMENTS