చిలకలూరిపేట: పట్టణంలోని కృష్ణ మహల్ రోడ్డులో గతంలో పొగాకు గ్రేడింగ్ పాయింట్లు ఉన్న స్థలంలో నిర్మిస్తున్న భారీ అపార్ట్మెంట్ నిర్మా...
చిలకలూరిపేట: పట్టణంలోని కృష్ణ మహల్ రోడ్డులో గతంలో పొగాకు గ్రేడింగ్ పాయింట్లు ఉన్న స్థలంలో నిర్మిస్తున్న భారీ అపార్ట్మెంట్ నిర్మాణం ఇప్పుడు స్థానిక ప్రజలకు శాపంగా మారింది. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా, నిబంధనలను తుంగలో తొక్కి సాగిస్తున్న ఈ పనుల వల్ల చుట్టుపక్కల నివాసితులు ప్రాణ భయంతో గడుపుతున్నారు.
అదురుతున్న ఇళ్లు.. ఆగని శబ్ద కాలుష్యం
నిర్మాణ పనులు ప్రారంభమైన నాటి నుండి భారీ జేసీబీలు, ట్రాక్టర్ల రాకపోకలతో వెనుక వైపు ఉన్న గృహ సముదాయాల్లో తీవ్రమైన శబ్ద కాలుష్యం నెలకొంది. మరీ ముఖ్యంగా బోర్లు వేసే సమయంలో భూమి విపరీతంగా కంపించడంతో, పాత ఇళ్ల గోడలు బీటలు వారుతాయేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు యంత్రాల హోరుతో వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు కంటిమీద కునుకు లేకుండా గడపాల్సి వస్తోంది.
తృటిలో తప్పిన ప్రాణాపాయం: అద్దాలు పగిలి రూమంతా గాజు పెంకులు..
గత 15 రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన ఈ నిర్మాణ పనుల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని అద్దం పడుతోంది. నిర్మాణ ప్రాంతంలో పనిచేసే సిబ్బంది విసిరిన రాయి వెనుక ఉన్న ఇంటి కిటికీకి తగలడంతో, అద్దం ముక్కలై గది మొత్తం గాజు పెంకులతో నిండిపోయింది. ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ చిన్న పిల్లలు ఆడుకుంటున్నా, ఎవరైనా నిద్రిస్తున్నా ఆ గాజు ముక్కలు గుచ్చుకుని ప్రాణాపాయం సంభవించేదని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.
గాలికి వదిలేసిన భద్రతా నిబంధనలు.
జనావాసాల మధ్య అపార్ట్మెంట్ వంటి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టేటప్పుడు చుట్టూ ఇనుప రేకులు అమర్చడం లేదా గ్రీన్ మ్యాట్ కట్టడం తప్పనిసరి. కానీ, ఇక్కడ అవేవీ కనిపించడం లేదు. ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో నిర్మాణ సామాగ్రి, దుమ్ము, రాళ్లు పక్కనే ఉన్న ఇళ్లపై పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా బిల్డర్లు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం గమనార్హం.
అధికారుల నిర్లక్ష్యం.. బాధ్యత ఎవరిది?
పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఈ విషయమై వివరణ కోరగా, "నోటీసులు ఇచ్చాం" అని ఒకే మాటతో సమాధానం చెప్పి చేతులు దులుపుకుంటున్నారు.అనుమతులు ఇచ్చిన అధికారులు క్షేత్రస్థాయిలో భద్రతా ప్రమాణాలను ఎందుకు తనిఖీ చేయడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. రేపు ఏదైనా ప్రాణనష్టం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి, నిబంధనలు పాటించే వరకు నిర్మాణ పనులను అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
COMMENTS