పురుషోత్తపట్నం వాసుల అవస్థలు... చిలకలూరిపేట: పట్టణంలోని పురుషోత్తపట్నం ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. అధికా...
పురుషోత్తపట్నం వాసుల అవస్థలు...
చిలకలూరిపేట: పట్టణంలోని పురుషోత్తపట్నం ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా స్థానిక ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు మరియు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తూతూమంత్రంగా ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు...
గతంలో పురుషోత్తపట్నం ఆర్చి వద్ద ఉన్న కల్వర్టులో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి నీరు నిలిచిపోవడంపై వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన అధికారులు కేవలం పైపైన వ్యర్థాలను తొలగించి చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇప్పుడు కల్వర్టు అడుగు భాగం వరకు పేరుకుపోయి, నీటి పారుదల పూర్తిగా నిలిచిపోయింది.
పాఠశాల ముందే మురుగు నిలవ!..
విద్యార్థుల ఆరోగ్యం ప్రశ్నార్థకం????
పురుషోత్తపట్నంలోని SPTRKM స్కూల్ ముందు, అలాగే దానికి ఎదురుగా ఉన్న కాలువలు గత కొన్ని నెలలుగా శుభ్రం చేయకపోవడంతో అధ్వాన్నంగా తయారయ్యాయి. కాలువల్లో మురుగు నీరు నిలిచిపోయి పాచి పట్టి, ముదురు రంగులోకి మారి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ అపరిశుభ్ర వాతావరణం మధ్యకు వెళ్తున్న పాఠశాల విద్యార్థులు ఏ క్షణాన రోగాల బారిన పడతారోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "పిల్లలకు ఏదైనా అనారోగ్యం వస్తే బాధ్యత ఎవరిది?" అని వారు ప్రశ్నిస్తున్నారు.
దోమల ఉధృతితో వృద్ధుల ఆవేదన...
సాయంత్రం వేళల్లో చల్లగాలి కోసం బయట కూర్చునే వృద్ధులకు ఈ మురుగు నీటి వల్ల పెరిగిన దోమలు శాపంగా మారాయి. మురుగు కాలువల వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి, రకరకాల రోగాలకు కారణమవుతున్నాయని స్థానిక రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ గానీ, సంబంధిత సిబ్బంది గానీ పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్...
పారిశుధ్య లోపం వల్ల వ్యాధిగ్రస్తం కాకముందే ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. కల్వర్టు కింద పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి, పాఠశాల పరిసరాల్లోని కాలువలను యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
COMMENTS