దింతనపాడు ఎస్టీ కాలనీ...వరద కష్టాలు - డ్యూటీకి డుమ్మా... ఎడ్లపాడు మండలం జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం ఏమాత్రం పట్టిం...
దింతనపాడు ఎస్టీ కాలనీ...వరద కష్టాలు - డ్యూటీకి డుమ్మా...
ఎడ్లపాడు మండలం జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం ఏమాత్రం పట్టించుకోకుండా ఎడ్లపాడు మండల రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. మండలంలోని దింతనపాడు గ్రామంలోని ఎస్టీ కాలనీలో ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రమైన వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యపై వార్తలు వచ్చిన తర్వాత, కేవలం రికార్డుల కోసం రెవెన్యూ సిబ్బంది ఆ ప్రాంతానికి వచ్చినట్లు 'వచ్చిన వారు ఎంతమంది' అంటూ నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది.
*అధికారుల నిర్లక్ష్యం: 'షిఫ్టు' డ్యూటీలు గాల్లో దీపాలు..*
ముఖ్యంగా, మండలంలో ఏ విధమైన అత్యవసర పరిస్థితి వచ్చినా, వెంటనే స్పందించి ప్రజలకు సహాయం అందించేందుకు వీలుగా.. మండలానికి సంబంధించిన ఒక్కొక్క ఏరియాను ఒక్కొక్క అధికారికి అప్పగించి, వారికి షిఫ్టుల వారీగా డ్యూటీలు కూడా కేటాయించినట్లు సమాచారం.
అయితే, దింతనపాడు ఎస్టీ కాలనీలో వరద నీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ, కేటాయించిన రెవెన్యూ అధికారులు మాత్రం ఆ షిఫ్టు డ్యూటీలో ఎవరూ కూడా కానరాకపోవడం అత్యంత ఆశ్చర్యకరం. అధికారులు కేవలం కాగితాలకే పరిమితమై, క్షేత్ర స్థాయిలో ప్రజల కష్టాలను పట్టించుకోకపోవడం, ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం లెక్క చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
*ప్రజల ఆవేదన - ఉన్నతాధికారులు స్పందించాలి..*
దీంతో, సహాయం కోసం ఎదురుచూస్తున్న ఎస్టీ కాలనీ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ ఈ అంశంపై దృష్టి సారించి, డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
COMMENTS