చిలకలూరిపేట:అది కేవలం ఒక మున్సిపల్ సమావేశం కాదు.. ఐదేళ్ల పాటు సాగిన ఒక సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికిన సందర్భం. నిన్నటి వరకు ...
చిలకలూరిపేట:అది కేవలం ఒక మున్సిపల్ సమావేశం కాదు.. ఐదేళ్ల పాటు సాగిన ఒక సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికిన సందర్భం. నిన్నటి వరకు ప్రజా సమస్యలపై గళమెత్తి, విమర్శలు-ప్రతివిమర్శలతో హోరెత్తిన ఆ హాలు.. సోమవారం మాత్రం ఉద్వేగపూరిత వాతావరణానికి వేదికైంది. మైలవరపు గుండయ్య కౌన్సిల్ హాలులో చైర్మన్ షేక్ రఫాని అధ్యక్షతన జరిగిన ఈ అత్యవసర సమావేశం సభ్యుల గుండె బరువును ప్రతిబింబించింది.
రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ ఆలింగనం..
ఈ నెల 17తో కౌన్సిలర్ల పదవీకాలం ముగియనుంది. సరిగ్గా ఒక రోజు ముందు జరిగిన చివరి సమావేశం కావడంతో, రేపటి నుంచి తామంతా ఒక్క చోట కలిసే అవకాశం ఉండదన్న సత్యాన్ని తలుచుకుని సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ సిద్ధాంతాలు, నాయకుల గొప్పతనం గురించి అప్పటిదాకా వాదించుకున్న సభ్యులు.. చివరకు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ వీడ్కోలు చెప్పుకున్నారు.
కన్నీటి పర్యంతమైన మహిళా కౌన్సిలర్..
ఈ ఐదేళ్ల కాలంలో ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు, సహకరించిన తోటి సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ టీడీపీ మహిళా కౌన్సిలర్ కూనల కన్నీటి పర్యంతమయ్యారు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో తమకు దక్కిన స్థానం మరువలేనిదని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
తప్పులుంటే క్షమించండి...
వైస్ చైర్మన్ ప్రజల సమస్యలు ప్రస్తావించే క్రమంలో అధికారుల పట్ల లేదా తోటి కౌన్సిలర్ల పట్ల తాను దురుసుగా ప్రవర్తించి ఉన్నా, మాటలు తూలి ఉన్నా పెద్ద మనసుతో క్షమించాలని వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వర్లు కోరారు. ఐదేళ్ల పాలనలో తనకు సహకరించిన చైర్మన్ షేక్ రఫానికి, అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అభివృద్ధి పథంలో మున్సిపాలిటీ: చైర్మన్ రఫాని..
గత ఐదు సంవత్సరాలుగా అందరూ కలిసికట్టుగా నిలిచి ప్రజా సమస్యలపై చర్చించారని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని కొనియాడారు. తమ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, మున్సిపాలిటీని 'సెలెక్షన్' గ్రేడ్‌గా మార్చగలిగామని చెప్పారు. త్యాగధనులు డాక్టర్ జాన్ డేవ్‌డ్ పేరును ఒక రోడ్డుకు నామకరణం చేసి సముచిత స్థానం కల్పించామని, నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
అధికారుల అనుభవాల వేదిక..
కేవలం కౌన్సిలర్లే కాకుండా, వారితో కలిసి పనిచేసిన మున్సిపల్ అధికారులు సైతం ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు, డీఈఈ షేక్ అబ్దుల్ రహీం తమ అనుభవాలను పంచుకుంటూ కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పదో వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి మరికొందరు సభ్యులు కుక్కల నివారణ, తాగునీటి సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఘనంగా నివాళులు.
సమావేశం ప్రారంభంలో ఇటీవల మృతి చెందిన ఏఎంజీ వ్యవస్థాపకుడు డాక్టర్ జాన్ డేవ్‌డ్ కుమార్తె పెర్సీ స్వరూప మృతి పట్ల సభ సంతాపం ప్రకటించింది. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కౌన్సిల్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
COMMENTS