మంచి కంఠం అన్నది మంచి వక్తకు ఉండవలసిన మొదటి అర్హత అవుతుంది. కొన్ని కొన్ని కంఠాలలో మనుషులలో ఆకర్షించి ఆకట్టుకునే గుణాన్ని మీరు చూస్తుంటారు. క...
మంచి కంఠం అన్నది మంచి వక్తకు ఉండవలసిన మొదటి అర్హత అవుతుంది. కొన్ని కొన్ని కంఠాలలో మనుషులలో ఆకర్షించి ఆకట్టుకునే గుణాన్ని మీరు చూస్తుంటారు. కాని చాలా వరకు మన కంఠాలను మనకు కావలసిన విధంగా స్థాయికి అలవాటు చేసుకుని మార్చుకోవచ్చు. కంఠం మంచిగా ఉన్నా స్టేజిఫియర్తో చాలా మంది మంచిగా ప్రసంగించ లేరు.
- స్టేజి ఫియర్ కి ప్రధానకారణం మానసికంగా సంసిద్ధత, తగిన ప్రిపరేషన్ లేకపోవడం, అందర్నీ గ్రీట్ చేయడం, సరదాగా జోకులు చెప్పడం వల్ల స్టేజ్ ఫియర్ మాయమవుతుంది. మీరు చెప్పదలుచు కున్న విషయాన్ని నెమ్మదిగా ప్రస్తావిస్తూ మధ్యమధ్యలో బ్రేక్ తీసుకుని హాయిగా మాట్లాడవచ్చు. చెడుభావాలను కాకుండా మంచి భావాలను వ్యక్తం చేయగల ముఖం మంచి వ్యక్తికి కావలసిన, రెండవ సుగుణం అవుతుంది.
- మైకు ముందు నిలబడే తీరు గొప్పగా హుందాతనంతో కూడినదిగా ఉండాలి. కనబడే తీరు చేతుల కదలికతో చెప్పే తీరు అన్నవి ఒక మంచి వక్త వద్ద ఉండవలసిన సుగుణాలు. జనంకేసి చూస్తూ హావభావాలతో మాట్లాడడం వల్ల ఉపన్యాసానికి జీవం వస్తుంది. మధ్యమధ్య ఉదాహరణలు, ఉపమానాలు, పిట్టకథలు, అనుభవాలు చెప్పటం ఉపన్యాసానికి సహకరిస్తాయి. ఉపన్యాసం వింటున్న వారికి, మనకి అంశంపై బాగా పట్టుంది అనుకోవాలి. శారీరక కదలికలు ద్వారా తాము చెప్పవలసిన విషయాన్ని చెప్పడానికి చాలా మంది వక్తలు ప్రయత్నిస్తుంటే శారీరక కదలికల ద్వారా కంటే కూడా గొంతుస్థాయి హెచ్చించి లేదా తగ్గించి చెప్పవలసిన దానిని చెప్పడం ద్వారా వక్త సభలను బాగా ఆకట్టుకోగలరు.
- సభను ఉద్దేశించి మాట్లాడడాన్ని బహిరంగ ఉపన్యాసం అంటారు. ఉపన్యాసం నిడివి అన్నది చాలా ముఖ్యమైన అంశం. మంచి ఉపన్యాసానికి ఒక గంట కాలం అన్నది పొడవైన సమయం. మీరు మరికొంతసేపు మాట్లాడి ఉంటే బాగుండేదన్న భావనను మీరు శ్రోతలలో కలుగజేయాలి. బాగా శ్రోతల మనసుపై హత్తుకునేలా మాట్లాడాలన్నప్పుడు ప్రజల నాడిని తప్పక చూస్తూ ఉండాలి. సభికులకు విసుగు కలగకముందే లేదా వారు సహనాన్ని, ఓపికను కోల్పోకముందే మంచి వక్త తన ఉపన్యాసాల్ని ఆపాలి.
- ఉపన్యాసం బాగుండేది, లేనిది అంతకు ముందు దానికి సంబంధించిన విషయాలు పూర్తిగా తెలుసుకోవటానికి చేసే కృషి మీద ఆధారపడి ఉంటుంది. పదినిముషాలు మాట్లాడాలంటే అంతకుముందు పదిగంటలైనా కృషిచేసి తయారవ్వాలి. చెప్పవలసిన విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుని పదిమంది ఎదుటకు వెళితే తడుముకొనే పనిలేకుండా ఉపన్యాసం దానంతటదే బయటకి వస్తుంది. అది వినేవారికి నచ్చుతుంది. ఉపన్యాసం వీలైనంత క్లుప్తంగా ఉండాలి.
- సభికులలో ఉత్సాహాన్ని రేకెత్తించి వారిని అలా కట్టుకుంటూ ఉండడం అన్నదే మంచి బహిరంగ సభల ఉపన్యాసకుడి లక్ష్యం అయి ఉండాలి. హాస్యం అన్నది శ్రోతలను ఆకట్టుకునే బ్రహ్మాస్త్రం సభికులను నవ్వించడం అన్నది వారి హృదయాలలో జొచ్చుకు పోవడానికి ఖచ్చితంగా ఉపయోగ పడుతుంది. మంచి మరపురాని సంఘటనలు పెద్దల జీవితంలో గడచినవి కథలు అన్నవి మంచి బహిరంగ ఉపన్యాసానికి పనికి వచ్చే సాధనాలు అవుతాయి. సంఘటనలను గురించి చెప్పడం, కథలను చెప్పడం అన్నవి చాలా స్వాభావికంగా చెప్పగలిగినప్పుడే చాలా సమంజసంగా ఉంటుంది.
- ఉపన్యాసం చేస్తున్నప్పుడు ముందుగానే ఆ ఉపన్యాసంను తయారుచేసుకోవాలి. మనసులోనే ఆ ఉపన్యాసాన్ని వల్లెవేసుకోవడం ఉత్తమమైనది. మీరు ఏ విషయాలను గురించి మాట్లాడదలచుకున్నారో దానికి సంబంధించిన ప్రణాళికను మనసులోనే తయారుచేసుకోండి.
- మీ ఉపన్యాసాన్ని ఎలా ప్రారంభించాలో, ఎలా ముగించాలో మనసులోనే ఒకసారి మననం చేసుకోండి. మీ మొత్తం ఉపన్యాసం యుక్తంగా ఉండాలి. మీరు గట్టిగా నొక్కి చెప్పాల్సిన అంశానికి దగ్గరగా ఉండేటట్లు చూడాలి. మీరు ఉపన్యసించే భాష కూడా ముఖ్యమైనదే. మీరు ఇంగ్లీషులో మాట్లాడుతున్నప్పుడు సులభమైన ఇంగ్లీషునే వాడాలి. అంతేకాని పెద్దపెద్ద మాటలను వాడకూడదు. మీ శ్రోతలు మీ మాటలను సులభంగా బాగా అర్థం చేసుకోవాలి. శ్రోతలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. సమయం దొరికినప్పుడంతా సభికులను దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతూ ఉండాలి. వారిని సంబోధిస్తూ ఉండాలి. అలా చేసారంటే సభలోని వారు వక్తకు సంబంధించిన ఎలాంటి ప్రతిక్రియను ప్రదర్శిస్తున్నారో తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది. అవసరం అనుకుంటే సభికులకు తగ్గట్లుగా మీరు మీ ఉపన్యాస ధోరణిని మార్చుకుంటూ ఉండండి.
- సభికులు అనేక రకాల వారై ఉంటారు. స్నేహపూర్వకంగా వ్యవహరించే సభికులు ఉన్నప్పుడు వారిని ఉద్దేశించి మాట్లాడడం అన్నది చాలా సులభం. ఒక్కొక్కసారి సభికులు ప్రతికూలంగా వ్యవహరిస్తారు. కాని కొంతమంది మాత్రం సభికులను మీకు విరుద్ధంగా లేదా ప్రతికూలంగా మార్చేందుకు ప్రయత్నించవచ్చును. మీ వద్ద సమయస్పూర్తి ఉన్నప్పుడు వారి మాటలను వారికి విరుద్ధంగానే వాడవచ్చును. చురుకైన హాస్యంతో కూడిన ఛలోక్తి వాడితే మీకు అడ్డు తగులుతున్న వాడిని సభికులు హాస్యం పాలు చేస్తారు.
- మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటలకు కొన్ని ప్రశ్నల ద్వారా అడ్డు తగులుతుంటారు. మీ వద్ద నుండి వారి ప్రశ్నలకు జవాబు రాబట్టుకోవడం అన్నది వారి ఉద్దేశ్యం అయి ఉండదు.
- మీ ఉపన్యాసాన్ని భంగపరచడం లేదా సభను చిందరవందర చేయడం అన్నదే వారి ఉద్దేశ్యం అయి ఉంటుంది. అటువంటి వారిని లెక్కచేయకుండా ఉండడం లేదా వారి ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా ఉండడం అన్నదే ఈ సమస్యకు ఉత్తమమైన మార్గం. మీరు చేస్తున్న ఉపన్యాసం శ్రోతలకు నచ్చని కారణంగా మీకు విరుద్ధంగా వారు వ్యవహరిస్తుంటే మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. అటువంటప్పుడు మీ వద్ద ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగించండి. అనర్గళంగా ఉపన్యసించండి. మీ శ్రోతలను ఒప్పించండి. మీ దృష్టిలో చెప్పడానికి ఇంకా బోలెడు విషయాలు మీ వద్ద ఉన్నాయన్న భావనను వారిలో కలిగించండి. ఉపన్యాసం ఇచ్చే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరూ వ్యక్త కావచ్చు. అయితే దేనికైనా క్లుప్తంగా అవసరం. విజయం అందులోనే ఉంది.

COMMENTS