నరసరావు పేట: సామాజిక సమానత్వం కోసం తన జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి డా. బీ.ఆర్ అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా కొ...
నరసరావు పేట: సామాజిక సమానత్వం కోసం తన జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి డా. బీ.ఆర్ అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా కొనియాడారు. ఒక జాతి అభివృద్ధికి కొలమానం ఆ జాతి స్త్రీ అభివృద్ధి అని దాదాపు వందేళ్ల క్రితమే దళిత మహిళలతో సంఘం ఏర్పాటు చేశారన్నారు. సామాజిక న్యాయం, మహిళా సమానత్వం కోసం అధికరణలను రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు.
మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని జాషువా సమావేశ మందిరంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా కలెక్టరేట్ లో అంబేద్కర్ ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ అంబేద్కర్ ఆరోజుల్లోనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా యూనివర్సిటీ లాంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో రెండు పీహెచ్డీలు, మూడు మాస్టర్స్ తో పాటు అనేక హనరరీ సర్టిఫికెట్లు పొందారన్నారు.
ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం విద్యపై దృష్టి సారించిందన్నారు. 29 వసతి గృహాల్లో 3500 మంది, 10 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 5000 మందికి పైగా విద్యార్థుల కోసం నూతన ఆర్వో ప్లాంట్లు, నీటి నాణ్యత పరీక్ష కిట్లు, నాణ్యమైన ఆహారంతో పాటూ గతంలో ఎప్పుడూ లేని విధంగా బూట్లు, నైట్ డ్రెస్సులు కూడా ఇస్తున్నారన్నారు. పుస్తకాలు, యూనిఫాం కిట్ లో భాగంగా అందిస్తున్నామన్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ ప్రతి విద్యార్థికి ' పిల్లల కోసం రాజ్యాంగం ' అనే పుస్తకాన్ని ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. చట్ట సభల పని తీరు గురించి తెలియజేసేందుకు విద్యార్థులతో అసెంబ్లీలో మాక్ అసెంబ్లీ నిర్వహించారన్నారు. రూ.12 కోట్ల మేరకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అందించామన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నీట్, ఐఐటీలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ర్యాంకులు సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో స్టడీ సర్కిల్ కోసం ప్రతిపాదన పంపుతామన్నారు.వచ్చే మూడు నెలల్లో నియోజకవర్గంలో 2000 ఎస్సీ గృహాలకు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఉచిత సోలార్ విద్యుత్ కనెక్షన్ ఇవ్వనున్నామన్నారు. ప్రతి నాలుగో శనివారం ఎస్సీలకోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామన్నారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు రూ. 2 కోట్లు చెల్లించామన్నారు. ప్రతి మండలంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించేలా ఆదేశాలిస్తామన్నారు.
ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ అంబేద్కర్ కారణంగా గొప్ప గొప్ప అభివృద్ధి దేశాలకు సైతం వందల ఏళ్ల తర్వాత కానీ దక్కని అందరికీ ఓటు హక్కు భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచే దక్కిందన్నారు. అంటరానితనం రూపుమాయిందన్నారు. తనకు అన్యాయం చేసిన వ్యవస్థ మీద ద్వేషం పెంచుకోకుండా వ్యవస్థను మార్చేందుకు కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. తన పోరాటంలో ప్రజలను ఏకీకృతం చేశారే కానీ విభజించలేదన్నారు. జిల్లాలో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.
ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడు అన్నారు. విద్యార్థులు ఆయన లాగా ఓర్పు, పట్టుదలతో చదువుకుని గొప్ప నాయకత్వం అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, దళిత సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS