చిలకలూరిపేట: ఐదేళ్ల అధికారంలో ప్రభుత్వ భూములు, ఆస్తుల్ని వైసీపీ నేతలు తమ సొంతఆస్తుల్లా భావించారని, దొరికినవాటిని దొరికినట్టు ఆక్...
చిలకలూరిపేట: ఐదేళ్ల అధికారంలో ప్రభుత్వ భూములు, ఆస్తుల్ని వైసీపీ నేతలు తమ సొంతఆస్తుల్లా భావించారని, దొరికినవాటిని దొరికినట్టు ఆక్రమించడం, అమ్మేయడం, తాకట్టు పెట్టడం వంటివి చేశారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
శనివారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) నిర్వహించారు. ఈ సందర్భంగా వంకాయలపాడు గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చిన వైసీపీనేతల భూ కబ్జా వ్యవహారంపై ఆయన స్పందించారు.
అక్రమార్కుల చెర నుంచి ప్రభుత్వ భూమిని విడిపించండి.. తహసీల్దార్ కు ప్రత్తిపాటి ఆదేశం.
వైసీపీ ప్రభుత్వంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చెర నుంచి విడిపించి ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామానికి చెందిన మల్లెల శంకర్, రాజా అహ్మద్ తో పాటు మరికొందరు మాజీమంత్రి ప్రత్తిపాటికి ఫిర్యాదు చేశారు. వంకాయలపాడు పంచాయతీ బోయపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ -18, ఎల్.పీ నెం-2379లోని 52 సెంట్ల ప్రభుత్వ భూమిని వైసీపీనేత, మాజీ ఎంపీపీ బింజు బుల్లెయ్య అప్పటి ప్రభుత్వ పెద్దల అండతో కబ్జా చేశాడని, వారు ప్రత్తిపాటికి తెలియచేశారు. అదే విధంగా సర్వే నెంబర్ 482 B/5 లో 2.02 సెంట్ల డొంక పోరంబోకుతో పాటు మొత్తం 3 ఎకరాల 06 సెంట్ల ప్రభుత్వ భూమి, సర్వే నెంబర్ 233లో 15.08 సెంట్ల చుక్కల భూమిని, 33 సెంట్ల ఇతరుల భూమితో మొత్తం 19.87 ఎకరాలను వైసీపీనేతలే ఆక్రమించారని ప్రత్తిపాటికి తెలిపారు. వారు చెప్పింది విని, వారి వినతులు పరిశీలించిన ఎమ్మెల్యే, వెంటనే యడ్లపాడు తహసీల్దార్ తో ఫోన్లో మాట్లాడారు. క్షేత్రస్థాయికి వెళ్లి రికార్డుల ఆధారంగా భూముల్ని పరిశీలించి, రీసర్వే చేసి అక్రమార్కుల చెరనుంచి ప్రభుత్వ భూముల్ని విడిపించాలని ఎమ్మెల్యే సూచించారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.
సంక్షేమ పథకాల అమల్లో చంద్రబాబుకు అపార అనుభవం..
సంక్షేమం అమల్లో ప్రభుత్వం అర్హులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం చేయదని, ప్రజలకు అవసరమైన పథకాలు అందించడంలో చంద్రబాబుకు అపార అనుభవం ఉందని ప్రత్తిపాటి తెలిపారు. తమకు పింఛన్లు రావడం లేదని పలువురు అర్జీలు అందించిన సందర్భంలో ప్రత్తిపాటి పై విధంగా స్పందించారు. ప్రస్తుతం మొదలైన జనగణనతో అర్హులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని, ప్రభుత్వ సిబ్బంది తమ ఇళ్లకు వచ్చి, అన్ని ప్రభుత్వ పథకాలు, సేవలపై పూర్తి సమాచారం సేకరిస్తారని, వారికి వాస్తవాలు తెలియచేస్తే, ప్రభుత్వం వెంటనే న్యాయం చేస్తుందని ప్రత్తిపాటి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, టీడీపీ నేతలు మద్దూరి వీరారెడ్డి, మద్దీబోయిన శివ, అధికారులు, కూటమి నాయకులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS