• సెల్ఫ్ ఎన్యూమరేషన్ (జనగణన) అవగాహన కార్యక్రమంలో ప్రత్తిపాటి చిలకలూరిపేట: ప్రభుత...
• సెల్ఫ్ ఎన్యూమరేషన్ (జనగణన) అవగాహన కార్యక్రమంలో ప్రత్తిపాటి
చిలకలూరిపేట: ప్రభుత్వ పథకాల అమల్లో పారదర్శకత.. మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపునకు జనగణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ఎంతగానో ఉపకరిస్తుందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు.
శనివారం చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన జనగణన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రత్తిపాటి, తొలుత తన వివరాలను స్వయంగా ల్యాప్ ట్యాప్ లో నమోదు చేశారు.అనంతరం జనగణన కార్యక్రమ యొక్క ప్రధానోద్దేశం..ప్రభుత్వాల లక్ష్యంపై పురపాలక మరియు సచివాలయ సిబ్బందికి ఆయన దిశానిర్దేశం చేశారు.
2011 నాటి జనాభా లెక్కలతో ఇప్పుడున్న పరిస్థితులకు తగినట్టు ప్రజలకు సరైన ప్రయోజనాలు అందడం లేదని, ప్రజల మేలుకోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా జనగణన ప్రారంభించాయని ప్రత్తిపాటి పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి.. ప్రజా సంక్షేమం నిరంతర ప్రక్రియ.
జనగణన ప్రక్రియ ప్రజలు, ముఖ్యంగా పేదల జీవితాల్లో అనూహ్య మార్పులు తీసుకొస్తుందని ప్రత్తిపాటి చెప్పారు. పేదల అర్హతను గుర్తించి.. వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి దోహదపడే ప్రభుత్వ పథకాలు వారికి సకాలంలో అందించేందుకు జనగణన సమాచారం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. అదే విధంగా జనాభాను బట్టి వారు నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయడం.. యువత విద్యార్హతలు. వారికి అవసరమైన ఉపాధి కల్పన అవకాశాలను వారికి చేరువ చేసేందుకు దోహదపడుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి నిర్దిష్ట పరిమితి, కొలమానం అనేవి ఉండదని, అదొక నిరంతర ప్రక్రియని, అది సజావుగా, సకాలంలో జరగాలన్న సదుద్దేశంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనగణనకు శ్రీకారం చుట్టాయని ప్రత్తిపాటి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్ లక్ష్యమైన విజన్ -2047 సాకారంలో జనగణన కీలకంగా నిలుస్తుందన్నారు. ప్రజలు నిస్సంకోచంగా అధికారులు, సిబ్బందికి తమ వివరాలు అందచేయాలని, ప్రజల అర్హతలు, రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలను బట్టే భవిష్యత్ లో కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల రమణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, బేరింగ్ మౌలాలి, షేక్ మస్తాన్ వలి, కొత్త కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, ఎమ్మార్వో హుస్సేన్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS