పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్‌కు చెందిన విద్యార్థి షేక్ జమీర్ బాషా జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించి జిల్...
పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్‌కు చెందిన విద్యార్థి షేక్ జమీర్ బాషా జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించి జిల్లాకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన “పరీక్షలపై చర్చ (Pariksha Pe Charcha)” కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కో విద్యార్థిని మాత్రమే ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్‌కు చెందిన షేక్ జమీర్ బాషా ఎన్నిక కావడం విశేషం.
నాలుగు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో షేక్ జమీర్ బాషా చురుకుగా పాల్గొని, ప్రధానమంత్రితో నేరుగా ఇంట్రాక్షన్ జరిపి తన ప్రతిభను చాటుకున్నారు. ఈ అరుదైన అవకాశం దక్కడం విద్యార్థి కృషికి నిదర్శనంగా నిలిచింది.
ఈ సందర్భంగా కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయరామరాజు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా షేక్ జమీర్ బాషాను ప్రత్యేకంగా పిలిపించి అభినందనలు తెలియజేశారు. అలాగే పల్నాడు జిల్లా డీఈవో రామారావు, నరసరావుపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు టి. రవికాంత్, ఉపాధ్యాయ బృందం మొత్తం విద్యార్థిని శుభాకాంక్షలతో అభినందించారు.
ఈ విజయంలో తనను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సహకారమే ప్రధాన కారణమని షేక్ జమీర్ బాషా వినయంగా తెలిపారు. ఆయన సాధించిన ఈ ఘనతతో పాఠశాల ప్రతిష్ఠ మరింత పెరగడంతో పాటు పల్నాడు జిల్లా విద్యార్థుల ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని విద్యావర్గాలు ప్రశంసలు కురిపించాయి.
COMMENTS