
యెమెన్ : యెమెన్ రాజధాని సనా నెత్తురోడింది. అనూహ్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో వందమంది చనిపోయారు. రెండువందల మంది గాయపడ్డారు. దేశ రక్షణ మంత్రి మహ్మద్ నాసర్ అహ్మద్‌ను హత్యచేయడం లక్ష్యంగా ఈ ఆత్మాహుతి దాడి జరిగిందని అనుమానిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే సిటీ స్క్వేర్‌లో ఒక భారీ సైనిక కార్యక్రమం జరుగుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. సైనికులను ఉద్దేశించి మాట్లాడ్డానికి మంత్రి వేదిక దగ్గరకు వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా పేలుడు సంభవించింది.
క్షణాల్లో అక్కడ నెత్తురోడుతూ పడివున్న సైనికులు, కొందరి తలలు తెగిపడిన దృశ్యాలూ కనిపించాయి. మరికొందరి శరీరభాగాలు తునాతునకలయ్యాయి. అక్కడికక్కడే నలభై మంది చనిపోయినట్లు నిర్ధారించారు. మిగతావారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని యెమెన్ ఆంతరంగిక శాఖ తెలిపింది. యెమెన్ ప్రభుత్వం అమెరికాకు తొత్తుగా వ్యవహరిస్తున్నందుకే ఈ ఆత్మాహుతి దాడి జరిపినట్లు అల్‌ఖైదా ప్రకటించింది. సైనిక కవాతులో పాల్గొంటున్న.. సెంట్రల్ కమాండ్‌కు చెందిన సైనికుడే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని యెమెన్ సైనికాధికారులంటున్నారు.






Comments