పుతిన్‌ ఆరాటం జుగనొవ్‌ పోరాటం!

  • Sharebar

రష్యా అధ్యక్ష ఎన్నికలకు ప్రచార గడువు దగ్గరపడుతున్న కొద్దీ పుతిన్‌ తన జిమ్మిక్కులను ముమ్మరం చేశారు. ఎన్నికల తరువాత ప్రధాని వ్లదిమిర్‌ పుతిన్‌ను హతమార్చేందుకు జరిగిన కుట్రను వమ్ము చేసినట్లు ప్రభుత్వ బాకా (టీవీ) సోమవారం ప్రకటించడాన్ని ఈ జిమ్మిక్కులలో భాగంగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆదివారంలోగా ప్రభుత్వం ఇంకెన్ని జిమ్మిక్కులను ప్రదర్శిస్తుందో చూడాలి. ఇదివరకెన్నడూ లేని రీతిలో ఈసారి పోటా పోటీ ప్రదర్శనలతో ప్రచారం హోరెత్తుతోంది. ఆదివారంనాటి మాస్కో మానవ హారం ఈ ప్రచార పర్వంలో ఒక హైలైట్‌ అని చెప్పవచ్చు. 16కి.మీ పొడవునా ఏర్పడిన ఈ మానవహారం పుతిన్‌ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. దీనికి మూడు రోజుల ముందు పుతిన్‌ తనకు అనుకూలంగా ఒక బలప్రదర్శన జరిపించారు. మానవ హారం ప్రతిపక్షాలన్నీ పాల్గొన్న ఉమ్మడి కార్యక్రమం. పుతిన్‌ తన ప్రచారంలో అమెరికా, ఇతర పశ్చిమ దేశాల వ్యతిరేకతను ముందుకు తేవటం ద్వారా తన పన్నెండు సంవత్సరాల పాలనా తప్పిదాలను కప్పి పుచ్చుకొని గట్టెక్కేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్షాలు పశ్చిమ దేశాల జోక్యాన్ని వ్యతిరేకిస్తూనే, పుతిన్‌ అక్రమాలను తూర్పారపడుతున్నాయి . పుతిన్‌ను అధికారానికి రాకుండా చూడాలన్నదే ఏకైక నినాదంగా వినిపిస్తున్నాయి. అధికార యునైటెడ్‌ రష్యా పార్టీ తరపున ప్రస్తుతం ప్రధానిగా ఉన్న వ్లదిమిర్‌ పుతిన్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడు. ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా పార్లమెంట్‌లో రెండవ పెద్ద పక్షమైన రష్యన్‌ ఫెడరేషన్‌ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా గెనడీ జుగనోవ్‌ బరిలో ఉన్నారు. వీరిరువురితో పాటు పచ్చి మితవాది లిబరర్‌ డెమొక్రటికి పార్టీకి చెందిన జిరినోవ్‌స్కీ, జస్ట్‌ రష్యన్‌ పార్టీ తరపున సర్గీ మెరొనొవ్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా మిఖాయిల్‌ ప్రొఖ్రొవ్‌లు అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. చివరి ముగ్గురూ అంత సీరియస్‌ అభ్యర్థులేమీ కాదు.   పుతిన్‌ ప్రభుత్వం రానున్న మూడు సంవత్సరాలకు బడ్జెట్‌ కేటాయింపులను ముందుగానే ప్రకటించింది. అధ్యక్షుడిగా తాను తిరిగి అధికారంలోకి వస్తే ఐదు లక్షల కోట్ల రూబుళ్లను రాష్ట్రాలకు కేటాయిస్తానని పుతిన్‌ వాగ్దానాలవర్షం కురిపిస్తున్నారు. ఈ ఒక్కసారికి తనను గెలిపించండంటూ ఓటర్లను బతిమిలాడుతున్నారు.

Comments

comments

Powered By Indic IME