
గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానికి అత్యంత సన్నిహితుడైన తెలుగుదేశం పార్టీ విజయవాడ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. ఆయన అజ్ఞాతవాసం టిడిపిని కలవరపెడుతోంది. ఆయన కూడా నాని బాటలోనే ఏ క్షణంలోనైనా జగన్‌కు జై అనవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మూడు రోజులుగా వంశీ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. పార్టీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పార్టీ సమావేశాలలో వంశీ పాల్గొన్నారు. జగన్‌ను నాని జైలులో కలిసినప్పుడు వంశీ పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. నానిపై టిడిపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కృష్ణా జిల్లా నేతలు మూకుమ్మడిగా ఓకే వేదికపై కనిపించి దుమ్మెత్తి పోశారు. కానీ వంశీ మాత్రం కనిపించలేదు.
ఆ తర్వాత కూడా వంశీ నానిపై స్పందించలేదు. ఆయన జగన్‌కు జై కొట్టడాన్ని తప్పు పట్టడమో లేక సమర్థించడమో చేయలేదు. దీంతో వంశీ కూడా జగన్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే వంశీ వర్గం మాత్రం ఆ వాదనలను కొట్టి పారేస్తుంది. అతను టిడిపిలోనే ఉంటారని, ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అతనికి టిడిపి అవకాశం ఇవ్వకుంటే ఇంట్లోనైనా కూర్చుంటారని, పార్టీ మారే ఉద్దేశ్యం మాత్రం లేదని చెబుతున్నారు.






Comments