రాయల తెలంగాణతో ప్రత్యేక వాదానికి చెక్..?

  • Sharebar


రాజకీయ ప్రయోజనాలను కాంగ్రెస్ క్షుణ్ణంగా బేరీజు వేసినట్టుంది. లేకపోతే ఎంత మొత్తుకున్నా ఏమీ పట్టనట్టున్న కంగ్రెస్ తెలంగాణపై ప్రకటనలు చేయడం వెనక ఆంతర్యం ఏదో ఉందని పలువురు భావిస్తున్నారు. ఒకవైపు రాష్ట్రపతి అభ్యర్థి గెలుపుకోసం అన్ని పార్టీలను కూడగట్టే పనిలో ఉంటూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాయకులు ఎవరొస్తే వారితో సోనియా గాంధీ పూర్తిస్థాయిలో రాష్ట్ర పరిస్థితులపై వివరాలను సేకరిస్తున్నారు.

పనిలోపనిగా తెలంగాణపై నాయకుల మనోగతం కూడా తెలుసుకుంటున్నారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన నాయకులందరూ రాయల తెలంగాణ ఇస్తే బావుంటుందని అధినేత్రికి విన్నవించినట్లు తెలుస్తోంది. అలా రాష్ట్రాన్ని విడగొడితే.. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోవచ్చని సోనియాకు నివేదికల ద్వారా తెలియజేసినట్లు వెల్లడైంది.

జగన్ మోహన్ రెడ్డి హవా తగ్గించాలంటే.. కేసీఆర్ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో కలుపుకుని పోవాలని మరికొందరు నాయకులు మేడం వద్ద విన్నవించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా, భౌగోళికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐతే సీమాంధ్రలో కొంతమంది నాయకులు సమైక్య రాగాన్నే ఆలపిస్తున్నారు.

రాయల తెలంగాణ తెరపైకి వచ్చిన తర్వాత అనూహ్యంగా తెరాస చీఫ్ కేసీఆర్, దానిపై ఎలాంటి వ్యాఖ్య చేయడం లేదు. ఆయనకు ఈసరికే కాంగ్రెస్ పార్టీ సమాచారాన్ని చేరవేసి ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాయల తెలంగాణ ఏర్పాటు చేసి కేసీఆర్ కు కీలకమైన పదవిని అప్పగించే అవకాశముందంటూ ఊహాగానాలు సైతం తిరుగుతున్నాయి.

Comments

comments

Powered By Indic IME