
ఆ రెండు పత్రికలతో పాటు.. ఆ టీవీ ఛానల్ ప్రభుత్వం, ప్రతిపక్షంతో కుమ్మక్కై సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఛానల్ లేకుండా చేయాలని చూస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. సాక్షి పత్రిక, టీవీ ఛానల్ లేకుంటే ఆ రెండు పత్రికలు రాసినవే నిజాలన్నారు. ఆ టీవీ ఛానల్ చూపించిందే సత్యమన్నారు. అందుకే.. తన ఒక్కడిని రాజకీయంగా ఎదుర్కోలేక అధికార, విపక్ష పార్టీలు కలిసి తమను అష్టకష్టాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
గుంటూరు జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాక్షి పత్రికను, సాక్షి టీవీని మూసేయించాలని అందరూ కలిసి కుట్ర పన్నుతున్నారన్నారు. సాక్షి లేకపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 చెప్పిందే వేదమన్నారు. ఇతరులు ఏం రాసినా జనానికి కనబడదు, వినపడదన్నారు.
ఈ రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మినహా మరొక పార్టీ ఉండకూడదా అని జగన్ ప్రశ్నించారు. అధికారం, ప్రతిపక్షం, ఎల్లో మీడియా కుమ్మక్కై చేస్తున్న చీకటి రాజకీయాలను అందరూ చూస్తున్నారని అన్నారు. పై నుంచి దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడని, ఎన్నికలు త్వరలో వస్తాయని, దేవుడు ఆశీర్వదిస్తాడని జగన్ పేర్కొన్నారు.






Comments