జగన్ గూటికి మరో 12 మంది ఎమ్మెల్యేలు?

  • Sharebar


తన అరెస్టుకు ప్రతీకారం తీర్చుకునే దిశగా వైఎస్.జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఇందులోభాగంగా తనకు మద్దతు ఇచ్చే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఒక చోటికి చేర్చే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ బాధ్యతలను ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావుకు అప్పగించినట్టు సమాచారం. దీంతో వెంటనే రంగంలోకి దిగిన రంగారావు తన పనిని ప్రారంభించారట. ఇందులో భాగంగానే పార్వతీపురం ఎమ్మెల్యే జయమణిని జగన్ వైపుకు తిప్పడమే కాకుండా, మరో కాకినాట సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కూడా జగన్‌కు జై కొట్టేలా చేసినట్టు చెబుతున్నారు.

మరో 10-12 మంది ఎమ్మెల్యేలు జగన్‌కు సంఘీభావం ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారని రంగారావు చెప్పారు. వీటిని రుజువు చేసేలా మరో 12 మంది ఎమ్మెల్యేలు జగన్‌ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి వారిలో.. శివప్రసాద్ రెడ్డి (దర్శి), సురేష్ (ఎర్రగొండపాలెం), ఆదినారాయణ రెడ్డి (జమ్మలమడుగు), విజయకుమార్ (సంతనూతలపాడు), పి.రామాంజనేయులు (భీమవరం), రాపాక వరప్రసాద్ (రాజోలు), కాటసాని రామిరెడ్డి (బనగానపల్లి), జనార్ధన్ (కురుపాం), రాజన్న దొర (సాలూరు), కన్నబాబు (యలమంచిలి) ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం జగన్ వైపు వస్తారని చెబుతున్న శాసనసభ్యులు ఇంతకు ముందు జగన్ వెంట నడిచినవారే కావడం గమనార్హం. వివిధ కారణాల వల్ల వాళ్లు అప్పట్లో వెనక్కి తగ్గారు. చివరకు 17 మంది మాత్రమే ఆయన వెంట మిగిలారు.

Comments

comments

Powered By Indic IME