
తనను మూడు లేదా నాలుగు రోజుల్లో అరెస్టు చేసి ఆ తర్వాత రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి తనపై మోపి తద్వారా ఉప ఎన్నికలను వాయిదా వేయించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుట్ర పన్నాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
గుంటూరు జిల్లాలో ఆయన సాగిస్తున్న ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ప్రసంగిస్తూ… నన్ను మూడు రోజుల్లో అరెస్టు చేస్తారట.. ఆ తర్వాత రాష్ట్రంలో గొడవలు సృష్టించి వాటిని నాపై నెట్టేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో జరుగనున్న 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు దక్కవని తేలిపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల విజయాన్ని ఏ ఒక్కరూ అడ్డుకోలేరన్నారు. అందుకే.. ఉప ఎన్నికల వాయిదాకు ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయని ఆరోపించారు.
అంతేకాకుండా, ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఏఐసీసీ పరిశీలకుడు వాయిలార్ రవితో సీబీఐ జేడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులు రహస్యంగా సమావేశమై మంతనాలు జరిపారంటూ జగన్ ఆరోపించారు. వీరంతగా కలిసి నన్ను అరెస్టు చేయించి, ఉప ఎన్నికలను వాయిదా వేసుకునేలా కుట్ర పన్నారన్నారు.
అంతేకాకుండా, రాష్ట్రంలో ఆ రెండు పత్రికలు, ఆ పార్టీలు మినహా మరో పార్టీ, మరో మీడియా ఉండరాదన్న కుట్రతో సాక్షి పత్రికను, సాక్షి టీవీని మూసి వేయించేందుకు కుట్ర చేశారన్నారు. ఆ ఫలితంగానే సాక్షి ఖాతాలను ఫ్రీజ్ చేశారని జగన్ ధ్వజమెత్తారు.






Comments