
రాజమండ్రి:35 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై తొలిసారి ప్రత్తిపాడు సభలో కోడిగుడ్లు, రాళ్లు విసిరారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడోస్థానంలో నిలుస్తుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు రాజమండ్రిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
మంత్రులకు క్లీన్ చిట్ ఇచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిగ్గుపడాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో సిబిఐ, ఆదాయం పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్లు బలహీనంగా ఉన్నాయని ఆయన అన్నారు. రాష్ట్రం పరువు ప్రతిష్టలను కాంగ్రెసు పార్టీ నాశనం చేసిందని ఆయన అన్నారు. మంత్రులకు కూడా అవినీతిలో భాగం ఉందని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డివి అవకాశవాద రాజకీయాలని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతి మంత్రులకు ప్రభుత్వం కొమ్ము కాస్తోందని ఆయన అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుట్రల వల్లనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చాయని, గతంలో ఎన్నడూ ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చాయని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పనని, మీరే చూస్తారు కదా అని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఉప ఎన్నికల్లో ప్రజలను చైతన్యవంతులను చేయడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ఇద్దరు అవినీతిపరుల మధ్య తమ పార్టీ నీతివంతంగా పోటీ చేస్తోందని ఆయన చెప్పారు. రాజకీయాల్లో జగన్‌ను ప్రోత్సహిస్తే విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అవినీతి గురించి తాము ఎన్నిసార్లు చెప్పినా చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు ప్రతిష్ట పోయింది, సంపదా పోయిందని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీ వైయస్ జగన్‌తో కుమ్మక్కయిందని ఆయన ఆరోపించారు. ఉప ఎన్నికలకు ముందు జగన్ అరెస్టు కావడం అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. వైయస్ జగన్ గెలిస్తే రాష్ట్రంలో హత్యా రాజకీయాలు చోటు చేసుకుంటాయని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని ఆయన అన్నారు.






Comments