ఓటమి ఖాయం… మూటముల్లె సర్దుకుందాం!

  • Sharebar


ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న విజయావకాశాలు పోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు ముందు కనీసం ఒకటి రెండు స్థానాల్లో అయినా గెలుపొందుతామన్న అంచనాల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అయితే, జగన్ అరెస్టు.. ప్రచార కథనంలోకి వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయలక్ష్మి బరిలోకి రావడంతో మిగిలిన ఆశలు పూర్తిగా అడుగంటి పోయాయన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు.

ప్రధానంగా నరసన్నపేటలో వైఎస్.విజయలక్ష్మి ఉప ఎన్నికల ప్రచారానికి వస్తున్నా జనమే ఇప్పటి వరకు రాష్ట్రంలో అత్యధికంగా వచ్చిన జనంగా పత్రికలే ఘోషిస్తున్నాయి. ఈ ప్రచారంలో ఆమె సెంటిమెంట్‌తో కూడిన ప్రసంగం చేస్తూ తన భర్త దివంగత మహానేత అమలు చేసిన పథకాలను గుర్తు చేస్తూ జగన్‌తో పాటు తమ కుటుంబం పట్ల కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలను తనదైనశైలిలో ప్రజలకు వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు.

మరోవైపు జగన్ చెల్లెలు షర్మిల.. అన్న మనోధైర్యాన్ని మెచ్చుకుంటూ.. తన ద్వారా ప్రజలకు పంపిన సమాచారాన్ని ప్రసంగం రూపంలో వివరిస్తున్నారు. వీరిద్దరు ప్రసంగాలను నిశితంగా గమనిస్తూ.. వైఎస్ఆర్ కుటుంబం పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిని బాహాటంగానే తప్పుబడుతున్నారు. ఇది కాంగ్రెస్ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు.

ఉపపోరులో కాస్తోకూస్తో పరువైనా దక్కుతుందనుకున్న సమయంలోనే జగన్‌ను ఆస్తుల కేసులో అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. ఇది పార్టీకి పెద్ద మైనస్‌గా మారిందని పార్టీ అధిష్టానానికి నమ్మకస్తుడైన ఓ ఎంపీ వాపోయినట్టు తెల్స్తింది. అంతేకాక ఉప పోరు ప్రచారంలోకి వైఎస్ విజయమ్మ దిగడంతో వైఎస్సార్‌సీపీకి సెంటిమెంట్ మరింతగా కలిసొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్నిచోట్ల రెండో స్థానంలో ఉంటామనుకున్న కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితిలేదని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.

విజయమ్మ రాకతో ఆశలు వదులుకున్న కొంత మంది నేతలు ఇంటిబాట పడుతున్నట్లు సమాచారం. ఉప పోరులో మెజార్టీ స్థానాలు గెలుస్తామనే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న నేతలు.. పార్టీ విజయంపై ఎప్పుడో ఆశలు వదులుకున్నట్లు పార్టీలోని కొంతమంది నేతలు గుసగుసలాడుకోవడం కొసమెరుపు. మరికొంతమంది అభ్యర్థులు ఇప్పటికే మూటముల్లె సర్దుకోవాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది.

Comments

comments

Powered By Indic IME