హస్తిన మార్కు రాజకీయం…!

  • Sharebar

 హస్తిన రాజకీయం సామాన్యులకు అంతుచిక్కదు. తలపండిన మేథావులు సైతం ఢిల్లీ నిర్ణయాలు అర్థం  కాక జుట్టుపీక్కుంటారు. జనపద్ లో అమ్మోరి  అంతిమ వాక్కు కోసం రోజుల తరబడి పడిగాపులు పడే ఖద్దరు కాకా రాయుళ్ళ నరక యాతన పగవాడిక్కూడా వద్దని మొక్కుకుంటారు, జగన్ వంటి ఏ కొద్దిమందో ఆదిలోనే జ్ఞానోదయమై అమ్మనొదిలి జనాన్ని నమ్ముకుంటారు. హస్తినపై ఆశ చావక చూరుపట్టుకు వేలాడే ముసలి ముతక నాయకులకు ఆఖరిదశలో అయినా పదవి వరించకపోదు. ఇప్పుడు అదే జరిగింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి పదవీ యోగం పట్టింది. కాంగ్రెస్  పాతకాపుగా…  తెలంగాణలో పార్టీకి నమ్మిన బంటుగా ఆయన స్థానం చెక్కుచెదరినిది.  పార్టీని నమ్ముకుని పడి ఉన్నదుకు రాజ్యసభ సీటు దక్కింది. అందరి అంచనాలకు భిన్నంగా పాల్వాయి ఢిల్లీ లో చక్రం తిప్పారు. కేకే వాచాలత్వాన్ని భరించలేమనుకున్న కాంగ్రెస్ అధిష్టానం కేకే బెదిరింపులకు భయపడలేదు సరికదా దిమ్మతిరిగేలా నిర్ణయం తీసుకుంది. కాపు సామాజిక వర్గానికే చెందిన చిరంజీవికి అన్నమాట ప్రకారం సీటిచ్చి బిసిలను దూరం చేసుకోలేదనే సంకేతం పంపింది. పది జనపద్ కొంపలో సోది చెబుతూ కూర్చునే రేణుకను చిన్నబుచ్చలేక ఓ రాజ్యసభ సీటును సోనియమ్మ  విదిల్చింది. ఉన్నవే నాలుగు సీట్లు. వాటిపై అందరికీ కళ్ళు. ఇక నాలుగో సీటుకు రాపోలు ఆనందభాస్కర్ ను  ఎంపిక చేశారు. ఆయన నేత కార్మిక వర్గానికి ప్రతినిధి. జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించి కాంగ్రెస్ నేతగా ఎదిగారు. ఢిల్లీ తీసుకున్న నిర్ణయాల్లో అనూహ్యమైనవి పాల్వాయి గోవర్ధనరెడ్డి, ఆనందభాస్కేర్ ల ఏంపికలే..!  ఈ ఎంపికల  వ్యవహారం పై  నిన్నటి దాకా ముఖ్యమంత్రి ఢిల్లీ లోనే ఉన్నా… చివరి క్షణం వరకూ పిసిసి అధ్యక్షుడు అమ్మ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఆయనకూ ఉప్పందినట్టులేదు. అసలు నాలుగో నాయకుడెవరో తేల్చకుండా నాన్చాడంలోనే కాంగ్రెస్ మార్కు రాజకీయం అర్థమవుతుంది.  నిన్నటి వరకూ అమ్మ దయకోసం అర్రులు చాచిన కేకే భంగపాటును వేలిగక్కడానికి తెల్లవారేసరికి తెలంగాణా రాగం అందుకున్నారు. అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలనే కోణం నుంచి కాంగ్రెస్ కొంత పక్కకు జరిగినట్టు అర్ధం అవుతూనే ఉంది. కమ్మ, రెడ్డి కులాలను కలుపుకు పోకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బతికి బట్టకట్టడం కష్టమని సోనియమ్మకు మనవాళ్ళెవరో జ్ఞానబోధ చేసినట్టున్నారు. అయినా ఎస్సి, ఎస్టి , మైనార్టీ వర్గాలు  ఇప్పటికే కాంగ్రెస్ పై గుర్రుగా ఉన్నాయి. ఇప్పుడా కోపం మరింత పెరుగుతుందని అటు సిఎం, ఇటు పిసిసి అధ్యక్షుడు భయపడుతున్నమాట నిజం. తమమాట నెగ్గించుకోవడం చేతకాని చేవచచ్చిన నాయకుల అండనే బతుకీడ్చాల్సిన దౌర్భాగ్యం మనది. యుపీఏ ప్రభుత్వం ఎపి.., ఎంపి ల భుజాలపై కొనసాగుతున్నదనే స్పృహ మనవాళ్లకూ లేదు. ఢిల్లీ పెద్దలకూ రాదు. అందుకే ఆంధ్రప్రదేశ్ అంటే అంత  చిన్న చూపు. మమతను చూసైనా మనం ఎంతో నేర్చుకోవాలి. కొంద్రంలో చక్రం తిప్ప్పగల ధీశాలి మమత. యుపిఎను తన గుప్పిట బంధించగల  రాజకీయ చతురత ఆమెది. త్రివేదిని దించేసినా ముకుల్ కు పదవి కట్టబెట్టినా అంతా  ఆమె ఇష్టప్రకారమే సాగుతోంది. ఆమె స్థాయి నాయకుడు కూడా లేని దిక్కుమాలిన రాష్ట్రం  మనది. ఈ పరిస్తితులు చూసే జనం సమర్ధుడైన నాయకుడి కోసం వెదుకుతున్నారు. కాంగ్రెస్ లో కాగడా  పెట్టి వెతికినా ఢిల్లీ ని ఎదిరించగల మీసమున్న రోషగాడు కనిపించడు. ఇక చంద్రబాబు సంగతి సరేసరి. నిద్రలోనూ  నిజం చెప్పని నిండు గోదారి ఆయన. అధికార పక్షమూ ., ప్రధాన ప్రతిపక్షమూ ఎన్ని కుయుక్తులు పన్నినా ఎన్ని అభాండాలు వేసినా జగన్ తప్ప వేరే దిక్కులేని స్థితి. రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు జరక్కపోతే అటు కాంగ్రెస్ ఇటు టిడిపి మట్టికొట్టుకుపోవడం ఖాయమేమో…?

                                                                                                                                                                 -శివరామ్

Comments

comments

Powered By Indic IME