సమరంలో సరదా…!!

  • Sharebar

రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మొత్తం ఉప ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. వాడి వేడి విమర్శలు జనానికి కావలసినంత వినోదాన్ని పంచుతున్నాయి. నిజానిజాలు ప్రజలకు తెలుసు. ప్రజలు విచక్షణ .. వివేచనతో సమయోచిత..సందర్భోచిత నిర్ణయాలు తీసుకుంటారని నాయకులకే తెలియడంలేదు. నిన్న గాక మొన్న ఉత్తరాదిన ఎన్నికలు జరిగితే… ప్రజా తీర్పు ఎంత నిజాయితీగా ఉంటుందో వెల్లడైంది. తమ ఆశలకు… ఆకాంక్షలకు అనుగుణoగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో తెలిసొచ్చింది. అయినా ప్రజల్ని బురిడీ కొట్టించాలనే మన నేతల దింపుడు కళ్ళం ఆశలు నేరవేరతయా..? ప్రజా చైతన్యం ప్రపంచ వ్యాప్తంగా కనబడుతోంది. ప్రజలు నాయకుల విశ్వసనీయతను కొలబద్దగా పరిగణిస్తున్నారు. నిజాయితీకి ఓటేస్తున్నారు. నిఖార్సైన నిర్ణయం తీసుకుంటున్నారు. ఉప ఎన్నికలు తెలంగాణలో అయినా… సీమాంధ్రలో అయినా ఇది కచ్చితంగా కీలక సమయం. ఈనాటి ప్రజాతీర్పు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందనడంలో సందేహంలేదు. స్వాతంత్రానంతర కాలంలో ఇప్పటి వరకు రెండు తరాలు గడచిపోయాయి. మూడో తరం ముందుకు వచ్చింది. వృద్ధ జంబూకాలకు యువతరం వీడ్కోలు చెబుతోంది. అఖిలేష్ యాదవ్ లాంటి భావితరాన్ని స్వాగతిస్తోoది. ఇదే దేశవ్యాప్తంగా కనిపిస్తోన్న మార్పు. యువతలోనూ జన హృదయాలను దోచుకున్నవారే నాయకుడిగా నిలబడగలుగుతున్నారు. రాహుల్ ను తిరస్కరించిన ప్రజలు అఖిలేష్ ను అక్కున చేర్చుకున్నారు. ఇద్దరిలో ఏ వైవిధ్యాన్ని జనం కనుగొన్నారో ఇప్పటికిప్పుడు తెలుసుకోవడం కష్టమే..! అయినా.. పాతతరం నేతలు నిశితంగా పరిశీలించక తప్పదు. వారిలో కొందరైనా గౌరవంగా రాజకీయాలనుంచి తప్పుకుంటే తిరస్కరణలు.., చీత్కారాలు లేకుండా బయటపడొచ్చు. ఒకటి రెండుసార్లు మంత్రులు .., ముఖ్యమంత్రులుగా చేసిన వారికి ఇంకా ఎందుకింత రాజకీయ వ్యామోహమో అర్థం కాదు. అరవై ఏళ్ళు రాకముందే ఉద్యోగాలనుంచి పంపిస్తున్న నేతలు.. డెభ్భై దాటుతున్నా చూరుపట్టుకు వేలాడడం ఏ రకం నీతో తెలీదు. నాయకత్వ లక్షణాలు పుట్టుకతో రావు. సామాజిక నేపధ్యాన్ని పరిశీలించి.. ప్రజా సంక్షేమాన్ని కాoక్షిస్తే వస్తాయి. ఇప్పటికే మన రాష్ట్రంలోని కొందరు నాయకులు తమ వారసులను రంగంలోకి దించుతున్నారు. మరికొందరు పరిస్తితుల ప్రభావంవల్ల నేతలుగా మారుతున్నారు. ఈ కోవకు చెందిన యువ నాయకుడే జగన్. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షానికి, అధికార పక్షానికి ఏకైక.. ఉమ్మడి శత్రువు ఒక్క జగన్ మాత్రమే. జగన్ చాల తెలివిగా తెలంగాణా బరినుంచి తప్పుకున్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టడంలో ఆయన నేర్పరిలా కనబడుతున్నారు. ఒకటి తెలంగాణా ప్రజల మనసుల్ని దోచుకోవడం. రెండు.. వృధా ప్రయాసను తప్పించుకోవడం. అలసట లేకుండా కోవూరులో ప్రచారం చేసుకోవచ్చు. తెలంగాణా ప్రజలు 2014 లో ఎలాగు తీర్పు చెప్పాలి. అప్పటిలోగా తన పునాదులు పటిష్టం చేసుకోవడం జగన్ వ్యూహంలో భాగమని భావించాలి. ఇప్పటికి రెండుసార్లు టిడిపి ని ప్రజలు తిరస్కరించారు. రాజశేఖరరెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయినా హనుమన్నలాంటి వాళ్ళు మాత్రం సోనియమ్మ బొమ్మ చూసి.., రాహుల్ రంగు చూసి ముచ్చటపడి వోట్లేశారని వకాల్తా పుచ్చుకుంటారు. ఎవరి అజ్ఞానం..అతి విశ్వాసం వారివి. ఇప్పుడు తెలిసిపోతుందిగా.. ఎవరి సత్తా ఏమిటో…! కనీసం ఉప ఎన్నికల్లో ఒకరిద్దరు అభ్యర్దులనైనా గెలిపించుకోలేనివారు.. రెండేళ్ళ తర్వాత ఎవరి నెత్తిన చెయ్యి పెట్టగాలుగుతారు. బంగారానికైనా కొంతకాలం తర్వాత వన్నె తగ్గుతుంది. అలాగే టియారెస్ ఉనికి మసకబారుతున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికలు ఆపార్టీ కి కూడా జీవన్మరణ సమస్యే. పోలింగ్ తేది దగ్గరపడుతుండడంతో విమర్శనాస్త్రాలు సంధించడం ఎక్కువైంది. ఫలితంగా జనం చెవుల తుప్పు వదిలి పోతోంది. తీర్పు వెలువడే వరకూ మనకీ బాధ తప్పదు.. భరిద్దాం..!!
 -శివరాం

Comments

comments

Powered By Indic IME